Education

గ్రామ వార్డ్ వాలంటీర్ ఉద్యోగులకు శుభవార్త || ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు

గ్రామ వార్డ్ వాలంటీర్ ఉద్యోగులకు శుభవార్త || ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు

 

గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రజలకు మధ్య వలంటీర్లే వారధులని, ప్రతి పథకాన్ని డోర్‌ డెలివరీ చేసేది వారేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. వలంటీర్ల ప్రతి కదలికా, ప్రతి అడుగూ ప్రభుత్వానికి మంచిపేరైనా తెస్తుంది లేదా చెడ్డపేరైనా తెస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా వారితో అడుగులు వేయించే బాధ్యత మనందరిదన్నారు. ఈ నేపథ్యంలో వారికి తగిన విధంగా శిక్షణ, అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15వతేదీన విజయవాడ–గుంటూరు ప్రాంతంలో తానే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, అధికారులు మండల స్థాయిలో ప్రారంభిస్తారని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అవినీతికి ఎక్కడా తావు ఇవ్వకూడదని ఎమ్మార్వోలు, ఎస్సైలు, దిగువస్థాయి అధికారులకు మరోసారి చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. వినతిపత్రాలతో వచ్చే ప్రజలను చిరునవ్వుతో స్వాగతించాలని, కలెక్టర్లు తప్పనిసరిగా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలన్నారు. గ్రామ, వార్డు  సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందచేసే సంక్షేమ పథకాల షెడ్యూల్, వారి విధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఈ పరీక్షలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్నందున ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కార్డుల జారీ
ఇక గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు మంజూరు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది 11 నెలల కాలానికి వర్తిస్తుందని, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, భూమిపై వారి హక్కులకు భంగం కలగకుండా కేవలం పంటపై మాత్రమే కౌలు రైతుకు 11 నెలలపాటు హక్కు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కౌలు రైతులకు కార్డులు అందగానే రైతు భరోసాకు అర్హులవుతారన్నారు. ఈ ఒక్కసారి మాత్రమే రైతు భరోసా రబీ సీజన్‌లో ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి మే నెలలోనే ఇచ్చి ఖరీఫ్‌లో బాసటగా నిలుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రధానికి ఆహ్వానం..
‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రానికి ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. అక్టోబర్‌ 15వతేదీన రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసాకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. దేశం మొత్తం ఈ కార్యక్రమం వైపు చూడాలని, ప్రధానిని ఆహ్వానించిన నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. 2.5 లక్షల మంది నియామకం ఓ రికార్డు
కేవలం 40 రోజుల వ్యవధిలో ఏకంగా 2.5 లక్షల మంది వలంటీర్ల నియామకం ఒక రికార్డు అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీగా నియామకాలు జరగలేదన్నారు. నియామకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షలు రాసేవారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని, పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తొలిసారిగా లక్షల మంది ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నందున అధికారులు చొరవ చూపించి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. స్పందనలో 90 శాతం వినతులు పరిష్కారం
‘స్పందన’ కార్యక్రమంలో 90 శాతం వినతులు పరిష్కారం అవుతున్నాయని, సమస్యల పట్ల వేగంగా స్పందిస్తున్నందువల్లే ప్రజల నుంచి వీటి సంఖ్య పెరుగుతోందని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ఇది చాలా మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. జూలై 31వతేదీ నాటికి 1,08,997 వినతులు అందగా జూలై మొదటి వారంలో వచ్చిన వినతులు 34,541 మాత్రమేనని సీఎం తెలిపారు. అధికారులందరినీ అభినందిస్తున్నామని, ప్రజలంతా స్పందన కార్యక్రమాన్ని బాగా వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో నాణ్యతపై కూడా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వివరంగా చర్చించారు. క్రమం తప్పకుండా కాల్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్‌ చేసి అభిప్రాయాలు సేకరిస్తామని సీఎం ప్రకటించారు. ఎమ్మార్వోలు, ఎస్సైలు, కలెక్టర్లు, ఎస్పీలు బాగా స్పందిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకుంటామని, సర్వేలు కూడా చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసంతృప్తితో ఉన్నవారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు. అసంతృప్తి స్థాయి 1 శాతం లోపే ఉండాలి..
అసంతృప్తి స్థాయి 1 శాతం కన్నా తక్కువే ఉండాలని, ఇది కష్టమే అయినా సాధించి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వినతుల పరిష్కారంలో అసంతృప్తి స్థాయి సగటు 9.5 శాతంగా ఉందన్నారు. అనంతపురంలో 13.9, చిత్తూరులో 10.3, తూర్పు గోదావరిలో 12.83, కృష్ణాలో 11.74 శాతం వినతుల పరిష్కార నాణ్యతలో అసంతృప్తి ఉందన్నారు. నాణ్యతపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. సొంత ఇంట్లో మనిషికి ఇబ్బంది తలెత్తితే ఎలా స్పందిస్తామో  అలాంటి స్పందనే ప్రతి అధికారీ వ్యక్తం చేయాలని, అప్పుడే అసంతృప్త స్థాయి 1 శాతం లోపు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. కలెక్టర్‌ నుంచి దిగువ స్థాయి అధికారి వరకు దీన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు. తిరస్కరించిన వినతుల సగటు 7.6 శాతంగా ఉందని, దీనిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఇసుక కొరతను నిర్మాణాత్మకంగా పరిష్కరించాలి
ఇసుక కొరత ఎక్కువగా ఉందని సమాచారం అందుతున్నందున నిర్మాణాత్మకంగా ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇసుక సరఫరాలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడు అవినీతి లేకుండా చూడగలిగామన్నారు.  మాఫియా, లూటీ పోయిందని, వీటిని అరికడుతూనే ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే అధికారుల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇప్పుడున్న 65 రీచ్‌ల నుంచి తగినంత ఇసుక అందుబాటులో లేనందున కనీసం 200 రీచ్‌ల ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబరు 5లోగా ప్రతి రీచ్‌లో వే బ్రిడ్జిలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఏపీఎండీసీ సన్నద్ధమవుతోందన్నారు. ఈలోపు ప్రతి రీచ్‌లో డంప్‌ యార్డులు అందుబాటులోకి తెచ్చి అక్కడే పర్మిట్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో డంప్‌ యార్డుల ఏర్పాటు కోసం సంబంధిత మంత్రులు, అధికారులకు ఇప్పటికిప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వరదల కారణంగా ఇసుక రీచ్‌లన్నీ మూతబడటంతో కొరత ఏర్పడిందని, వరదలు తగ్గగానే మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని కలెక్టర్లు తెలిపారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో సమృద్ధిగా నీళ్లు
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రానికి కృష్ణా జలాలు వస్తున్నాయని, అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వేశారని, దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేవలం నెల రోజులు మాత్రమే వరద నీటి నిల్వకు అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నింపాలని ప్రధానంగా రాయలసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. నీళ్లు సమృద్ధిగా ఉన్నా ఎందుకు నింపలేకపోతున్నామో కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కొన్ని చోట్ల కాల్వలకు గండ్లు పడుతున్నాయని, కృష్ణా పరీవాహక ప్రాంతంలో ముంపు ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరిలో వరద తగ్గుతున్నందున వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలు సేకరించేలా చర్యలు తీసుకోవడంతోపాటు పంపిణీలో సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలని, కరువుకు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,  ప్రతిపాదనలు పంపితే వెంటనే స్పందిస్తామని సీఎం తెలిపారు. ‘స్పందన’ కార్యక్రమం మహిళలకు అండగా నిలుస్తోందని, పోలీస్‌శాఖకు అందే వినతుల్లో 48 శాతం వారి నుంచే వస్తున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. సెప్టెంబరు నుంచి జిల్లాల్లో సీఎం పర్యటన
సెప్టెంబరు నుంచి తాను స్వయంగా జిల్లాల పర్యటనలు చేపడతానని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వారు ఎవరూ ఉండకూడదని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీని సంతృప్తికర స్థాయిలో పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కలెక్టర్లు సమీక్షలు నిర్వహించాలని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, వీలైనంత వరకు గ్రామానికి దగ్గరగా ఉండే జాగాలను ఇళ్ల స్థలాల కోసం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వలంటీర్ల విధులు, సంక్షేమ పధకాలపై సీఎం ప్రకటించిన షెడ్యూల్‌ ఇదీ…
– వలంటీర్లు ఆగస్టు 16వతేదీ నుంచి 23 వరకు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు.
– ఆగస్టు 26 నుంచి 30 వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేయడంతోపాటు  లబ్ధిదారులను గుర్తిస్తారు.
– సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకు బియ్యం, పెన్షన్లు డోర్‌ డెలివరీ చేస్తారు.
– పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు.
– ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాలో నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీ.
– సెప్టెంబరు 11 నుంచి 15 వరకు పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలంటీర్లు గుర్తిస్తారు.
– ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు.
– మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులను కూడా వలంటీర్లు గుర్తిస్తారు.
– సెప్టెంబరు 15 నుంచి 30 వరకు గ్రామ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది.
– సెప్టెంబరు 29న గ్రామ సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ.
– అక్టోబరు 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి.
– అక్టోబరు 3 నుంచి 30 వరకూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు విడతల వారీగా శిక్షణ.
– దరఖాస్తు అందిన 72 గంటల్లోగా పరిష్కారం అయ్యేలా సచివాలయాలు కృషి చేస్తాయి:
– గ్రామ సచివాలయంలో ప్రతివారం స్పందన కార్యక్రమం నిర్వహణ
– గ్రామ వలంటీర్ల ద్వారా కానీ, నేరుగా గానీ ప్రజల నుంచి అందే వినతులు స్వీకరించాలి.
– వినతులు తీసుకోగానే వాటికి రశీదు ఇవ్వాలి
– ప్రస్తుతం స్పందన కార్యక్రమంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను గ్రామ సచివాలయాలు కూడా పాటించాలి
– పెన్షన్లు, రేషన్‌ కార్డులు తదితరాలు 72 గంటల్లోగా ప్రింట్‌ చేసి ఇచ్చే స్థాయికి చేరుకోవాలి
– గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button