Minister Harish Rao
నెలరోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి.. మహిళలకు వడ్డీలేని రుణాలు: మంత్రి హరీశ్‌రావు
నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రకియ్ర పూర్తికాగానే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు.
- బలమైన లీడర్వల్లే టాప్‌లో రాష్ట్రం
- అన్నిరంగాల్లో మనం ముందంజ
- సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట,ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రకియ్ర పూర్తికాగానే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. సిద్దిపేట శివారు రంగనాయక సాగర్ వద్ద ఉన్న తెలంగాణ తేజోవనంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
సిద్దిపేట రూరల్ మండలం రాంపూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట రైల్వేస్టేషన్లో రైలు ట్రయల్ రన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు రాగా, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూరులో మంత్రి హరీశ్‌రావుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మంత్రి ధన్యావాదాలు తెలిపా రు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చిన్న గ్రామమైన రాంపూర్‌లోనే యాసంగిలో 18 లారీల ధాన్యం పండించారని గుర్తుచేశారు.
స్ట్రాంగ్ లీడరా? రాంగ్ లీడరా?
కాంగ్రెస్, బీజేపీ నాయకులు తిట్టడంలో పోటీపడితే, సీఎం కేసీఆర్ పుట్లకొద్దీ వడ్లు పండించడంలో పోటీ పడుతున్నారని మం త్రి చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని తెలిపారు. దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.1000కి మించి పెన్షన్ ఇవ్వడం లేదని విమర్శించారు. స్ట్రాంగ్ లీడర్ కావాల్నా? రాంగ్ లీడర్ కావాల్నా? అని ప్రజలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు బలమైన నాయకుడిగా ఉన్నందువల్లనే నేడు తెలంగాణ హరితహారంలో, తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో, ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో డాక్టర్లతయారీలో నంబర్‌వన్‌గా ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.