Rupee as international currency
అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి
వచ్చే పదేళ్లలో మరిన్ని రంగాల్లో మన దేశం ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై పడకుండా…
దేశం మరింత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాల్సిందే..
ద్రవ్యోల్బణ కట్టడిలో ఎంపీసీ పాత్ర భేష్
అభివృద్ధే ఇక ఆర్బీఐ ప్రాధాన్యత:_ ప్రధాని మోదీముంబై: వచ్చే పదేళ్లలో మరిన్ని రంగాల్లో మన దేశం ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఇది అత్యంత అవసరమన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 90 వసంతాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మన రూపాయిని అందరికీ ఆమోదయోగ్యమైన, అందుబాటులో ఉండే అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పని భారం మరింత పెరుగుతుందన్నారు. ఉద్యోగులు ఇందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని కోరారు. ఇప్పటి వరకు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధాన దృష్టి పెట్టిన ఆర్బీఐ వచ్చే పదేళ్లు, జీడీపీ వృద్ధి రేటు పెంచడాన్నే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ద్రవ్య స్థిరత్వం, విశ్వసనీయతలపైనా ఆర్బీఐ దృష్టి పెట్టాలని సూచించారు.
ఆర్బీఐ పాత్ర భేష్: జీడీపీ వృద్ధి రేటు వేగంగా, స్థిరంగా పెరగడంలో ఆర్బీఐ పోషించిన పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. ద్రవ్యోల్బణ కట్టడిలోనూ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) చురుకైన పాత్ర పోషించిందన్నారు. నిరంతరం ధరల పర్యవేక్షణ, స్థిరమైన ద్రవ్య విధానాల ద్వారా కొవిడ్ వంటి కష్ట సమయంలోనూ ఎంపీసీ ద్రవ్యోల్బణాన్ని పెద్దగా కోరలు చాచకుండా కాపాడిందన్నారు. కొవిడ్ ప్రభావంతో ఇంకా అనేక దేశాలు సతమతమవుతున్నా, భారత్ మాత్రం ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రధాని అన్నారు.
ఆదుకున్న ఆర్బీఐ నైపుణ్యాలు: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడంలో వృత్తిపరమైన ఆర్బీఐ నైపుణ్యాలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకుల ఆస్తులు-అప్పుల పట్టికలను మెరుగుపరచడంలోనూ ఆర్బీఐ చర్యలు ఎంతో ఉపకరించాయన్నారు. గత పదేళ్లలో ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు.
బలమైన ద్రవ్య వ్యవస్థే మా లక్ష్యం: వచ్చే పదేళ్లలో స్థిరమైన, బలమైన ద్రవ్య వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఆర్బీఐ లక్ష్యంగా ఉంటుందని ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి ఇది పునాది రాయిలా ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్బీఐ ఎప్పటికప్పుడు అవసరమైన విధాన మార్పులు తీసుకుంటున్న విషయాన్ని దాస్ గుర్తు చేశారు.
ఆర్బీఐ 90వ వార్షికోత్సవ సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేస్తున్న ప్రధాని మోదీ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
బ్యాంకింగ్ వ్యవస్థ మారాలి
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకుల విధానాలూ మారాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. దేశ భవిషత్ అభివృద్ధికి దోహదం చేసే రంగాలకు అవసరమైన రుణ వితరణపై బ్యాంకులు దృష్టి పెట్టాలని కోరారు. అంతరిక్ష రంగంలో ఉన్న కంపెనీలు, పర్యాటక రంగంలోని కంపెనీలకు మంచి భవిష్యత్ ఉందన్నారు. అయోధ్య ముందు ముందు అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. బ్యాంకులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగాల్లోని కంపెనీల రుణ సాయంపై దృష్టి పెట్టాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు సైబర్ నేరాలు పెరిగి పోవడంపైనా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బెడదను అరికట్టేందుకు బ్యాంకులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.