Rythu Bandhu
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుపై సర్కార్ కీలక ప్రకటన.. నిధుల విడుదల ఎప్పుడంటే?
తెలంగాణలో రైతు బంధు పథకం కింద నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం రైతు బంధు. ఈ పథకం కింద ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది కేసీఆర్ సర్కార్.
సీజన్ కు ఓ సారి రూ.5 వేల చొప్పున రెండు విడతల్లో పెట్టుబడి కోసం ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో రైతు బంధు పథకం సాయంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
జూన్ మొదటి వారంలో రైతు బంధు పథకం నిధులను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నూతన సచివాలంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైతు బంధు స్కీమ్ ద్వారా ద్వారా రాష్ట్రంలోని 59.26 లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజన్లో ఒక కోటి 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనతో ప్రణాళికలు రూపొందించాలన్నారు.
మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యే అవకాశం ఉందన్నారు. పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాల్సి ఉందన్నారు. అంతేకాదు వివిధ రకాల పంటల సాగుకు మొత్తం 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు. ఈ మేరకు వాటిని సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ పథకాన్ని మే 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఎలాంటి దరఖాస్తు లేకుండా.. ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది.