rythu bandhu updates 2023-24 || ts rythu runamafi updates 2023-24
ts rythu runamafi updates
పండుగలా.. వ్యవసాయం
రైతుబంధు పథకంతో రైతులకు బతుకుపై భరోసా కల్పించడంతో మండలంలో సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు వ్యవసాయంలో సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
- రైతుబంధుతో రైతులకు భరోసా
- పెట్టుబడి సాయంతో పెరిగిన సాగు విస్తీర్ణం
- ప్రభుత్వ నిర్ణయంతో రైతుల హర్షం
కులకచర్ల, ఫిబ్రవరి 18 : రైతుబంధు పథకంతో రైతులకు బతుకుపై భరోసా కల్పించడంతో మండలంలో సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు వ్యవసాయంలో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలకు పెట్టుబడి సాయం లేక ఇతరుల వద్ద అప్పులు చేసి వ్యవసాయం చేసే వారు. నాణ్యమైన విత్తనాలు విత్తక పోవడంతో పంట దిగుబడి సరిగా చేతికి రాక చేసిన అప్పులు తీర్చలేక అసలు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు పెరిగి పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలిసిన రైతుబిడ్డగా వారి కన్నీళ్లు తూడ్చాలనే సంకల్పంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రతి ఏడాది రెండు పంటలకు సాయం అందించేందుకు కృషి చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు బంధును సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఎకరాకు రూ.5వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో రైతుబంధు కింద ఆర్థిక సాయం అందుతుండడంతో వారు పొలాల్లో మరింత ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
9,321 ఎకరాల్లో..
గత ప్రభుత్వాలు వ్యవసాయం చేస్తే ఏమి లాభం ఉండదని, ఇతర వ్యాపారాల ద్వారా లబ్ధి పొందాలని సూచించాయి. అయితే సీఎం కేసీఆర్ వ్యవసాయం దండుగ కాదు పండుగలా చేసుకోవాలని రైతు బంధు ద్వారా వారికి ఆర్థిక సాయం అందజేశారు. వ్యవసాయం తెలిసిన సీఎంగా రైతు బిడ్డగా రైతులకు అనేక విధాలుగా సహాయం అందిస్తూ వారి హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. కులకచర్ల మండలంలో 9,321 ఎకరాల్లో 5,183మంది రైతులు వరిని రబీలో సాగు చేశారు. వేరుశనగ పంటను 676 ఎకరాల్లో 400మంది రైతులు సాగుచేశారు. ఈసారి గత వేసవి పంటల కంటే అధికంగానే వరి పంటను రైతులు పండించారు.
చేయూతనిచ్చిన రైతు బంధు
కులకచర్ల మండలంలో రైతులకు పంటను పండించేందుకు రైతు బంధు చేయూతనిస్తున్నది. రైతులు వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకోకుండా పెట్టుబడి ఖర్చు రైతు బంధు ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుండడంతో వారు వరి పంటను పండించేందుకు ఆసక్తి చూపారు. రెండు నెలల క్రితం రైతు బంధు సాయం 11,561మంది రైతులకు రూ.12.18 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నాం
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. రైతులకు రెండు పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వడం సంతోషంగా ఉన్నది. పంటకు పెట్టుబడి సాయం అందించిన సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలి. రైతు బంధుతో పాటు రైతు బీమా పథకం రైతులకు చాలా ఉపయోగపడుతున్నది.
– కొత్త బలిజ వేణు, రైతు, పీరంపల్లి, కులకచర్ల మండలం
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. పెట్టుబడిని అందించి వ్యవసాయం చేసుకునేలా ప్రోత్సహించే సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతులందరం రుణపడి ఉంటాం. రైతులు అప్పులు చేసే బాధలు తీరాయి. పెట్టుబడికి సరైన సమయంతో పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
– దామోదర్‌రెడ్డి, రైతు, రాంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం.
సాగు విస్తీర్ణం పెరిగింది
గతంలో కంటే ప్రస్తుతం వరి సాగు గణనీయంగా పెరిగింది. కులకచర్ల మండలంలో 9,321 ఎకరాల్లో 5,183 మం ది రైతులు వరి పంటను సాగుచేశారు. ప్రభుత్వం ద్వారా రైతు బంధు వస్తుండడంతో సాగుపైన రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో యాసంగిలో పంటలు సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం రెండు పంటలు సాగు చేస్తున్నారు. – వీరస్వామి, మండల వ్యవసాయాధికారి, కులకచర్ల.