Telangana Government JobS 2022-23
సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాల ప్రకటనకు ఏడాది.. విడుదలైన ముఖ్యమైన నోటిఫికేషన్లు ఇవే!
రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు విడుదలైన ముఖ్యమైన నోటిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి నేటికి.. అంటే మార్చి 9వ తేదీకి ఏడాది. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ ఆ రోజు అసెంబ్లీలో తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు నోటిఫికేషన్ల (Telangana Job Notifications) విడుదలను వెంటనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు వివిధ నియామక సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వరుస నోటిఫికేషన్లతో దుమ్ములేపుతోంది. ఇప్పటికే ముఖ్యమైన గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లెక్చరర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, డిగ్రీ లెక్చరర్ తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు సైతం విడుదలయ్యాయి. ఇంకా పోలీస్ శాఖ నుంచి సైతం భారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి. మొత్తం 20 వేలకు పైగా ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటనలు విడుదల చేసింది.
\1\6గ్రూప్-1: మొత్తం 503 ఖాళీలతో తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సైతం పూర్తికాగా.. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మొత్తం 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేసింది టీఎస్పీఎస్సీ.
గ్రూప్-2: తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో సారి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 5, 51,943 మంది అభ్యర్థులు గ్రూప్-2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
గ్రూప్-3: మొత్తం 1,363 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. తర్వాత ప్రభుత్వం మరో 12 పోస్టులను కలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్ష తేదీలు ఇంకా విడుదల కాలేదు.
వీటితో పాటు డాక్టర్లు, వార్డెన్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లైన్ మెన్ తదితర అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
-ఇంకా టీచర్, గురుకులాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్లు కూడా విడుదలైతే సీఎం ప్రకటించిన మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లక్ష్యం దాదాపుగా చేరుకున్నట్లే అని అధికారులు చెబుతున్నారు.