Telangana Government Jobs 2022 updates
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 15 రోజుల్లో మరో నోటిఫికేషన్? వివరాలివే
తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీస్, గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ముగిసింది. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను సైతం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవలే ప్రకటించింది. విద్యుత్ శాఖ నుంచి సైతం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
టీచర్ ఉద్యోగాలకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. పరీక్ష నిర్వహించిన అధికారులు, ఫలితాలను సైతం విడుదల చేశారు. దీంతో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సైతం అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్, ఇరిగేషన్, R&B, RWS శాఖల్లోని ఏపీ ఉద్యోగాల భర్తీకి TSPSC ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా శాఖల్లో ఖాళీలకు సంబంధిచిన సమగ్ర వివరాలను సేకరించారు. ఈ పోస్టులన్నింటీన ఓకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలన్న లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ మరో 15 రోజుల్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించిన మేరకు.. ఇప్పటివరకు మొత్తం 46,988 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇందులో పోలీస్, ఫారెస్ట్, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, పంచాయతీరాజ్, రవాణా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమ, విద్య, ఆరోగ్య శాఖల్లోని 45,325 ఖాళీలు ఉన్నాయి.
తాజాగా.. నీటిపారుదల, ఆర్అండ్బీ శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్ పోస్టులతో కలిపి 1,663 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ పోస్టులు ఉన్నాయి. ఇంకా.. 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు సైతం ఉన్నాయి.
ఇంకా.. భూగర్భ జలశాఖలో 88 ఖాళీలు, ఆర్అండ్బీ శాఖలో 38 సివిల్ ఏఈ, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 27 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆర్థిక శాఖలోని 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు సైతం ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.