TS Budget 2024 Live Updates
బడ్జెట్ రూ2.70 లక్షల కోట్లు?
2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమైంది. ఈ బడ్జెట్ పద్దు దాదాపు రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమైంది. ఈ బడ్జెట్ పద్దు దాదాపు రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న బడ్జెట్ కంటే ఇది 10 శాతం తక్కువగానే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖజానాకు సమకూరుతున్న వాస్తవ రాబడులు, గత ప్రభుత్వం చేసిన వాస్తవ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. అనవసర పటాటోపాలకు పోకుండా, తన ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ సర్కారు చాలా జాగ్రత్తగా బడ్జెట్‌కు రూపమిచ్చినట్లు తెలిసింది.
ఇది తాత్కాలిక బడ్జెటే అయినప్పటికీ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చినందున.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. విపక్షాల నుంచి విమర్శలు ఎదురుకాకుండా, సొంత పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు లభించేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఆర్థిక శాఖలో పాత అధికారులే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తన ఆరు గ్యారెంటీలతో పాటు, ప్రాధమ్యాలను వివరించి, ఆ దిశగా బడ్జెట్‌ను రూపొందించేలా శ్రద్ధ పెట్టింది.
మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈసారి కొన్నింటిని అమలు చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇవ్వబోతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల్లో కొన్నింటికి చోటు కల్పించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి గ్యారెంటీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్లో నిధులను కేటాయించినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.3000 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
దీనిని ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలంటే ప్రభుత్వానికి భారంగా పరిణమించనుంది. దీనికోసం రూ.4000 కోట్లకు పైగానే విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కల్యాణమస్తు పథకం కింద రూ.1,00,116 నగదును అందిస్తూనే.. తులం బంగారాన్ని కూడా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అంటే.. ఒక్కొక్క లబ్ధిదారుకు దాదాపు రూ.1.70లక్షలను వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ శాఖలు అందజేసిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా పక్కాగా లెక్కించి, పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతిపాదించే బడ్జెట్ 100 శాతం వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని..
2023-24లో బీఆర్ఎస్ సర్కార్ రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ నుంచి విద్యుత్తు సంస్థల బకాయిల తాలూకు రూ.17,828కోట్లు, గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.40వేలకోట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ నిధులు అందేవి కావన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది. 2022-23లో రూ.2.56లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్.. రూ.2లక్షల కోట్లనే ఖర్చు చేయగలిగింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, సర్కారు తన ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది.