TS Police, Group1 Jobs Application || తెలంగాణలో పోలీస్, గ్రూప్ 1 జాబ్స్ కు దరఖాస్తులు ప్రారంభం.. తొలిరోజు ఇలా..
తెలంగాణలో పోలీస్, గ్రూప్స్ ఖాళీలకు దరఖాస్తుల ప్రక్రియను సోమవారం ప్రారంభించారు అధికారులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కొలువుల (Telangana Government Jobs) జాతర కొనసాగుతోంది. గ్రూప్1, పోలీస్ జాబ్స్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ (Jobs Application) సైతం సోమవారం ప్రారంభమంది. దరఖాస్తుల ప్రక్రియ తొలిరోజైన సోమవారం రోజు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 1కు (TSPSC Group 1) సంబంధించి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 3,895 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఇంకా పోలీస్ జాబ్స్ కు సంబంధించి 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. అయితే.. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు. గ్రూప్ 1 కు సంబంధించి 5 నుంచి 8 నిమిషాల్లో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు బోర్డు అధికారులు ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోగా.. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి టెక్నికల్ టీమ్ ను సైతం అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఈ నెల 31ని, పోలీస్ జాబ్స్ కు సంబంధించి ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొందరు సైబర్ నేరగాళ్ల ఇదే వెబ్ సైట్ల మాదిరిగా కొన్ని ఫేక్ వెబ్ సైట్లను తయారు చేసి అభ్యర్థులను బోల్తా కొట్టిస్తున్నారు. https://www.tslprb.in/ పేరును పోలిన tslprb.co.in వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే.. వివిధ ప్రకటనలో కూడిన ఇతర వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అయితే, దీనిని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభ్యర్థులు ఈ విషయంపై జాగ్రత్తగా వ్యవహరించాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు.