TSPSC Group 1 Recruitment 2022 – Notification, Vacancy, Exam Pattern
గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 19 ప్రభుత్వ విభాగాల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-1లో 503 పోస్టులు
3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి
16 వేల పోలీసు పోస్టులు ఉండే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది. 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యంత కీలకమైన గ్రూప్-1తోపాటు పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో నియామక బోర్డులు పకడ్బందీగా ఏర్పాట్లుచేశాయి. ఒకటికి రెండు సార్లు సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రచించాయి. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 19 ప్రభుత్వ విభాగాల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందుకోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నది. దీనిపై శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సమావేశమైంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దుతో నియామక ప్రక్రియలో సుమారు మూడు నెలల సమయం ఆదా కానున్నది. గ్రూప్-1 క్యాడర్లో కొత్తగా కొన్ని పోస్టులను చేర్చారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వాటిని కొత్తగా సృష్టించింది. వాటిపై కొంత స్పష్టత రావాల్సి ఉన్నది. మైనార్టీ సంక్షేమ అధికారుల పోస్టులు కొత్తగా వచ్చాయి. వాటిని గ్రూప్-1 కింద చేర్చుతూ ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా రాలేదు. డీఎస్పీ పోస్టులపై స్వల్ప సవరణ ప్రతిపాదనలు హోంశాఖ నుంచి అందాల్సి ఉన్నది. వీటికి సంబంధించిన జీవోలను సోమవారం నాటికి ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ జీవోలు రాగానే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నది. ఇందుకోసం ఆదివారం కూడా విధులు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
పోలీస్ కొలువులకూ నోటిఫికేషన్!
పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారమే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సైతం రానున్నట్టు సమాచారం. 16 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఈ ఉద్యోగాలకు ప్రభుత్వం మూడేండ్లు వయోపరిమితి పెంచటంతో సుమారు 7 లక్షల మందికి పోటీ పడే అవకాశం దక్కనున్నది. టీఎస్పీఎస్సీలాగే పోలీస్ ఉద్యోగానికి సైతం యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్నీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడూ చూసుకొనే అవకాశం కల్పించారు. దీనిద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయాలని టీఎస్ఎస్పీఆర్బీ యోచిస్తున్నది.
టెట్‌లో ఇబ్బందుల నేపథ్యంలోనే మార్పులు
ఇటీవలే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఎగ్జామ్ సెంటర్ల కోసం ఆప్షన్లు ఇవ్వకుండా, ఏదో ఒక జిల్లాను ఎంచుకొనే అవకాశమిచ్చారు. ఇది సమస్యాత్మకంగా మారింది. దరఖాస్తులు భారీగా రావడంతో సెంటర్లను కేటాయించడం ఇబ్బందిగా మారింది. పరీక్షా కేంద్రాల సామర్థ్యానికి మించి దరఖాస్తులు రావడంతో కొన్ని జిల్లాలు నిండిపోయాయి. దీంతో సెంటర్లు లేక జిల్లాలను బ్లాక్ చేశారు. ఇలా ఏకంగా 28 జిల్లాలను బ్లాక్ చేయాల్సి వచ్చింది. 6 లక్షల అభ్యర్థులకే ఈ పరిస్థితి రావడంతో టీఎస్పీఎస్సీ అధికారులు ముందే అప్రమత్తమయ్యారు.
గ్రూప్-1 సెంటర్ల కేటాయింపు ఇలా..
ఈసారి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నారు.
ఒక అభ్యర్థి నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ ఇలా 8 -10 వరకు జిల్లాలను ఎంపికచేసుకోవాలి.
సెంటర్ల కేటాయింపులో భాగంగా తొలుత నల్లగొండ జిల్లాను పరిగణనలోకి తీసుకొంటారు. అక్కడ సెంటర్లు అందుబాటులో లేకుంటే సూర్యాపేటను లెక్కలోకి తీసుకొంటారు. అక్కడ కూడా సెంటర్లు అందుబాటులో లేకపోతే ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి ఇలా వరుస క్రమంలో అభ్యర్థి ఎలా ఎంచుకుంటే అలా సెంటర్లను కేటాయిస్తారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సెంటర్ కేటాయించే వరకు ప్రక్రియ కొసాగుతుంది.
దరఖాస్తు సమయంలో ప్రతి అభ్యర్థి 8-10 జిల్లాలను తప్పనిసరిగా ఆప్షన్స్‌గా ఎంచుకోవాలి. ఒకటి రెండు ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.