తెలంగాణ రైతులకు శుభవార్త..
ఎకరాకు రూ.10వేలు.. మే 12 నుంచి ఖాతాల్లోకి డబ్బులు
Telangana: అకాల వర్షాల వల్ల తెలంగాణలో పంటలు ధ్వంసమయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వానలు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐతే ఆ రైతులను ఆదుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నష్టం పరిహారం చెల్లించనుంది.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. గత నెలలో అకాల వర్షాల వల్ల సంభవించిన నష్టాలకు బాధితులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలతో నష్టపరిహారం పంపిణీ తేది ఖరారయింది. పంట నష్టపోయిన రైతులకు ఈ నెలకు 12 నుంచి నష్టపరిహారం అందజేయనున్నారు. ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేస్తారు.
గతంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను స్వయంగా సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పంట పొలాలను సందర్శించి అక్కడే పరిహారం ప్రకటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులందరికీ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కౌలు రైతులకు కూడా పరిహారం అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కానీ సీఎం ప్రకటించినా.. నష్టపరిహారం ఇంకా రైతులకు అందలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమై పది రోజుల్లోనే నివేదికను సిద్ధం చేసింది.
ఐతే ఏప్రిల్ తొలివారంలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు సంబంధించిన నష్ట పరిహారాన్ని మాత్రమే ప్రభుత్వం అంచనా వేసినట్లు సమాచారం. ఆ తర్వాత కురిసిన వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు.. ఇంకా పదిహేను రోజుల సమయం పట్టే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్లో మొదటి వారంలో పంట నష్టపోయిన రైతులకు మొదట నష్టపరిహారం ఇస్తారు. ఆ తర్వాత మిగతా వారికి ఇస్తారు. ఐతే కేవలం వరి రైతులకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తారు. మిగిలిన వారి పరిస్థితేంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అకాల వర్షాల వల్ల వరితో పాటు మామిడి, మిరప, అరటి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎండాకాలంలో రెండుసార్లు భారీ వర్షాల వల్ల పంట నష్టపోయారు రైతులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవతా థృక్పపంలో అందరికీ పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.