Anganwadi jobs 2023
10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నెలాఖరు వరకే గడువు!
ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే ఇళ్లు గడవడం కష్టంగా మారింది. అయితే ఇద్దరూ ఉద్యోగాలు, పనులకు వెళ్లిపోతే చిన్న పిల్లలు, పెద్దవారిని చూసే వారుండరు. కాబట్టి.. మహిళలు ఇంటి వద్దనే ఉండిపోతున్నారు. అయితే సొంత గ్రామం, ఊరిలో ఉంటూనే చేసుకునే ఉద్యోగాలు దొరికితే.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలైతే..?
కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల తక్కువ చదువుకున్నారా, వివాహమై.. ఖాళీగా ఉంటున్నారా? ఉద్యోగం చేసి భర్తతో పాటు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉందామని భావిస్తున్నారా? నెలకు పదివేలు వచ్చినా చాలని ఆలోచిస్తున్నారా? హా అవునండి అంటున్నారా? అయితే.. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం దొరికితే..? భర్త, పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి కల్లా మీరు ముందే వచ్చి అన్నిసర్థిపెట్టే ఉద్యోగం దొరికితే? .. ఆశకు హద్దు ఉండాలి.. ఈ రోజుల్లో చదివినా, చదవకపోయినా 10 టూ 6 ఉద్యోగాలు.. ఇంకా గంట గంటలు ఆఫీసుల్లో గడపాల్సిందే కానీ తక్కువ సమయంలోనూ, అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం దొరకడం హాస్యాస్పదం అనుకుంటున్నారా? డోంట్ వర్రీ.. అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయండీ. ఆ ఉద్యోగాలను అందింస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని అవకాశాలున్న ఆ ఉద్యోగం ఏంటనీ తెలుసుకోవాలనుకుంటారా? అదే అంగన్ వాడీ.
సొంత ఊరిలో ఉంటూ చేసుకునే ఉద్యోగాల్లో ఒకటి అంగన్ వాడీ. భారత దేశంలోని బాల బాలికలకు, గర్బవతులకు, ముఖ్యంగా పేద మహిళలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అంగన్ వాడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలో నడుస్తాయి. ఇటీవల అంగన్ వాడీలలో కార్యకర్తల, హెల్పర్ల పోస్టులకు కేంద్రం భారీగానే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉత్వర్వులు జీవో.నెం 21, 28, 38, 39, 7, 15, 8, 1, 25 ప్రకారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో ప్రతి మండలానికి పోస్టులను కేటాయించారు. మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుకు కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికులైన వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 35 ఏళ్ల లోపు వివాహితులు మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రోస్టర్ విధానం ప్రకారం ఈపోస్టులను కేటాయించారు.
ఇందులో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు, ఎక్స్ ఆర్మీ కోటా కింద పోస్టులున్నాయి. ఎంపిక ప్రక్రియ సెలక్షన్ కమిటీపై ఆధారపడి ఉంటుంది. మహిళలు.. దరఖాస్తుతో పాటు పదవతరగతి మార్కుల జాబితా, టీసీ, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను జతపరచాలి. ఈ నెల 31వ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రూ.11,500 జీతం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే స్థానికంగా ఉండి అక్కడ పరిసర ప్రాంతాల్లో 3 ఏళ్లలోపు వయస్సు గల చిన్న పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం, బాలింతలు, గర్భీణీలకు ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారం అంటే గుడ్లు, తినే పిండి పదార్థాలు, బెల్లపు అచ్చులు, పాలు వంటివి అందించడం చేయాలి. గర్బిణీల వివరాలను పొందుపరచాలి. దీంతోపాటు ప్రభుత్వం నిర్వహించే జనాభా సర్వేలు, ఇతర సర్వేలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినెలా ఆయా నియోజకవర్గంలోని సీడీపీవో కార్యాలయంలో సమావేశానికి హాజరుకావాలి.