CM KCR Updates
క్రమబద్ధీకరణ స్థలాల రిజిస్ట్రేషన్ షురూ
జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకున్న వారి పేరిట స్థలాలు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ రెండు రోజుల కిందట సర్క్యులర్ జారీ చేశారు.
సర్క్యులర్ జారీ… నేటి నుంచే అమలు
జీవో నంబర్ 59 కింద దరఖాస్తులకు మోక్షం
45 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులు
వెయ్యి కోట్ల ఆదాయంపై సర్కారు నజర్
త్వరితగతిన పోడు భూములకు పట్టాలు!
ప్రగతి భవన్లో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్
జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకున్న వారి పేరిట స్థలాలు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ రెండు రోజుల కిందట సర్క్యులర్ జారీ చేశారు. అర్హులైన దరఖాస్తుదారులు నిర్దేశించిన సొమ్ము చెల్లిస్తే వారికి ఆయా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం సొమ్ము చెల్లించిన దరఖాస్తుదారులకు తహసీల్దార్ కన్వెయన్స్ డీడ్ జారీ చేస్తారు. దాన్ని సబ్ రిజిస్ట్రార్ ఎలాంటి ఫీజులు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ శుక్రవారం నుంచే మొదలుకానుంది. ఇళ్ల నిర్మాణం కోసం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు సర్కారు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జీవో నెంబరు 59 కింద దరఖాస్తు చేసుకున్న వారికి స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు. ఈ దరఖాస్తులు 63,748 వరకు వచ్చాయి. వీటిపై జిల్లా ఉన్నతాధికారులు 2022 సెప్టెంబరులో విచారణ చేసి సుమారు 45 వేల మంది వరకు అర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు పంపిన నోటీసుల ప్రకారం డబ్బులు చెల్లించిన వారికి శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నారు.
విస్తీర్ణం ఆధారంగా చార్జీలు
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు స్లాబ్ విధానం అమలు చేయనున్నారు. మురికివాడల్లోని నివసించే దరఖాస్తుదారులకు 126-150 గజాల విస్తీర్ణాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన విలువలో 10 శాతం, ఇతర ప్రాంతాల వారు 20 శాతం చొప్పున చెల్లించాలి. 125-250 గజాలకు 25 శాతం, 251-500 గజాలకు 50 శాతం, 501-750 గజాలకు 75 శాతం, 751 గజాలకు పైన ఉంటే 100 శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. నిర్మాణం విస్తీర్ణానికి, ఆ నిర్మాణం ముందున్న ఖాళీ స్థలానికి ప్రభుత్వ విలువ ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ స్థలాలకు 2014 జూన్ 2 నాటికి కొన్నట్టు సూచించే డాక్యుమెంట్లు, కరెంట్ బిల్లులను ఆధారాలుగా చూపించాలి.
వెయ్యి కోట్ల రాబడికి చాన్స్!
స్థలాల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి కాసుల పంట పండనుంది. దాదాపు వెయ్యి కోట్ల ఆదాయం సమకూరవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను మార్చి 21 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు చెందిన దరఖాస్తుదారుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ జిల్లాల నుంచి రూ.200 కోట్లకుపైగా వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.30 కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రూ.20 కోలట్లు వసూలు చేసినట్లు సమాచారం.