Rythu Bandhu 2024
రైతులకు షాక్.. రైతుబంధుపై కోత.. లబ్దిదారుల సంఖ్య బాగా తగ్గిపోయే పరిస్థితి!
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి విషయంలో అప్రమత్తంగా ఉంటోంది. దుబారా ఖర్చు అని ఏది అనిపించినా, దానికి భారీగా కోత పెడుతోంది. రైతు బంధు పథకం విషయంలోనూ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము రైతు భరోసా పథకాన్ని తెచ్చి రైతులకు, కౌలు రైతులకూ సంవత్సరానికి ఎకరానికి రూ.15,000 చొప్పున ఇస్తామనీ, రైతు కూలీలకు ఎకరానికి రూ.12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చెయ్యలేకపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ.. కొంతమంది రైతులకు మనీ విడుదల చేసింది. అది గత సంవత్సరం రైతు బంధుకి చెల్లించాల్సిన మనీ. అది కూడా చాలా మంది రైతులకు ఇంకా రాలేదు.
మరి ఈ సంవత్సరం సంగతేంటి? అనే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి, అందులో కోతలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాలలోపు వారికే ఈ పథకాన్ని అమలు చెయ్యాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పే కారణంగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులు, నేతలు, అధికారులు, సెలబ్రిటీలు కూడా రైతు బంధు పొందారు. ఎవరిదాకో ఎందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి స్వయంగా తాను రైతుబంధు పొందినట్లు చెప్పారు. ఆయనకు 800 ఎకరాల భూములున్నాయి. అంటే అత్యంత సంపన్నులు కూడా ఈ పథకాన్ని పొందినట్లైంది. ప్రజాధనం వృథా అయ్యింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కోతలపై అధికారులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం.
వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థను సంప్రదించారు. ఈ సంస్థ ద్వారా శాటిలైట్ చిత్రాలతో.. భూములను గుర్తిస్తారు. తద్వారా ఏ రైతుకి ఎంత పొలం ఉందో తెలుసుకుంటారు. తద్వారా ఆ రైతు అర్హులా కాదా అన్నది తేల్చుతారని తెలుస్తోంది.