Rythu Bandhu scheme Updates 2023 || TS Rythu Bandhu
సాగు బాగు.. రైతే రాజు
సాగు బాగు.. రైతే రాజు
వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలు అమలై సత్ఫలితాలు ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భారంగా చేసిన వ్యవసాయాన్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు రావడంతో రైతన్నలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు.
- సీఎం కేసీఆర్ నిర్ణయాలతో ఆనందంలో అన్నదాత
- వ్యవసాయ రంగంలో అనేక మార్పులు
- మేడ్చల్ జిల్లాలో రైతుబంధు సాయం రూ. 343.48 కోట్లు
- 438 కుటుంబాలకు రూ.21.7 కోట్లు రైతుబీమా అందజేత
వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలు అమలై సత్ఫలితాలు ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భారంగా చేసిన వ్యవసాయాన్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు రావడంతో రైతన్నలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ సాగుకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా, వివిధ పంటలకు ప్రభుత్వం రాయితీలను అందించి రైతులకు అండగా నిలువడంతో వ్యవసాయ సాగు విస్తరించింది. నాటి పరిస్థితులలో భూమి ఉన్నా.. వ్యవసాయం బందుపెట్టి కూలీకి పోయిన అన్నదాత.. నేడు తన భూమిని తానే దున్నుకుంటూ.. దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాడంటే.. ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు.
మూడింతలు పెరిగిన సాగు విస్తీర్ణం
వ్యవసాయ రంగంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎంతో అభివృద్ధి సాధించింది. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 22.103 ఎకరాలలో మాత్రమే రైతులు సాగు చేసేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు అమలు చేసిన తర్వాత 2018 నుంచి 2022-23 సంవత్సరం నాటికి 71.347 ఎకరాల సాగు విస్తీర్ణం పేరిగింది. అప్పటితో పోల్చిచూస్తే ఇప్పుడు సాగు విస్తీర్ణం మూడింతలు పెరిగింది. వరి సాగుతో పాటు కూరగాయలు, పండ్లు, వాణిజ్య పంటలను సాగు చేస్తూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.
రైతుబంధు సాయం రూ. 343. 48 కోట్లు
ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.343.48 కోట్లు పంట పెట్టుబడి సాయంగా అందించింది. జిల్లాలోని 42,201 మంది రైతులకు రైతుబంధు నగదు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పంట పెట్టుబడి సాయంతో పంట సాగుకు ఎలాంటి అప్పులు తీసుకోకుండా పంటలు సాగు చేసుకుంటున్నారు. రైతుబంధు పథకం, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 71.347 ఎకరాల విస్తీర్ణంలో ప్రసుత్తం వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు.
జిల్లాలో 9 రైతు వేదికలు
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులను సన్నద్ధం చేసేలా ప్రభుత్వం రూ.1.98 కోట్లతో 9 రైతు వేదికలను నిర్మించింది. రైతు వేదికల ద్వారా పంటల సాగు తదితర అంశాలపై వ్యవసాయాధికారులు సూచనలు చేసేందుకు రైతు వేదికలు రైతులకు ఉపయోగకరంగా మారాయి. సీజన్ల వారీగా వేసే పంటల సాగుకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేస్తున్నారు. వివిధ రకాల పంటలు విత్తనాలు నాటే నుంచి మొదలు పెడితే పంటలు చేతికి వచ్చే వరకు వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతు వేదికలలో ఇచ్చిన వివరాల ప్రకారం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
పండించిన ధాన్యం కొనుగోలుపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పిస్తున్నది. ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. గత సంవత్సర కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నది. ఎ గ్రేడ్ రకానికి రూ.2060, బి.గ్రేడ్ రకానికి రూ.2040 చెల్లిస్తుంది.
ఉద్యాన, పండ్ల తోటలకు ప్రోత్సాహం
ఉద్యాన, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం పోత్సాహం అందిస్తున్నది. తోటల విస్తరణ పథకం కింద మామిడి, జామ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, కూరగాయల నారు, మొక్కలు, ఎరువులు, పురుగు మందులను 40 శాతం రాయితీపై అందిస్తున్నారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు 512 మంది రైతులకు 414 హెక్టార్లకు ఈ పథకం ద్వారా రూ.71 లక్షలు అందించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీ పైన 2534 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లకు రూ.2.52 కోట్లు అందజేశారు.
రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికల ముస్తాబు..
శనివారం జరిగే రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికలను ముస్తాబు చేశారు. రైతు వేదికలను మామిడి తోరణాలు, పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్ర వ్యవపాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా తదిరత పథకాలను రైతులకు కళ్లకు కట్టినట్లుగా కనపడే విధంగా ఫెక్సీలను తయారు చేసి రైతు వేదికల వద్ద ఉంచారు.
మూడుచింతలపల్లిలో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో శనివారం జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రకార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ పాల్గొననున్నారు. రైతులతో సమావేశమై వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని రైతులకు మంత్రి మల్లారెడ్డి వివరించనున్నారు.
కేసీఆర్‌తోనే వ్యవసాయానికి మంచిరోజులు
ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో వ్యవసాయం పండుగలా మారింది. గతంలో వ్యవసాయం చేయాలంటే తప్పని సరిగా అప్పు చేయాల్సి వచ్చేంది. అప్పు చేసి పంట సాగు చేస్తే కరెంటు ఉండక పంటలు ఎండిపోయేవి. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 నుంచి రైతుబంధు ఇస్తుండటంతో వ్యవసాయ సాగును మళ్లీ ప్రారంభించాం. 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చినప్పటి నుంచి వ్యవసాయం ద్వారా ఆర్థికంగా ఇప్పుడు ఎదుగుతున్నాం. పంటలకు ముందే మద్దతు ధరను ప్రకటించి రైతులలో ధైర్యాన్ని నింపుతున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే వ్యవసాయానికి ఎప్పుడూ మంచి రోజులే ఉంటాయి. నాకు ఉన్న 2 ఎకరాల 20 గుంటల భూమిలో వరి, కూరగాయలను సాగు చేసుకుంటున్నా.
– కొంపల్లి రవి, రైతు, కేశవరం గ్రామం, మేడ్చల్ జిల్లా
రాష్ట్ర ఏర్పాటుతో..మా బతుకులు మారాయి
గతంలో పంటల సాగుకు నీళ్లు ఉండేవికావు. అరకొర నీటిని పెడుదామంటే కరెంటు సరిగ్గా మోటార్లు కాలిపోయేవి. నాకు ఉద్దమర్రిలో ఉన్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం నరకంగా ఉండేది. అప్పులు చేసి అవస్థలు పడి, వ్యవసాయం బందు పెట్టినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు మారాయి. రైతుబంధు పథకం, 24 గంటల కరెంటుతో తిరిగి వ్యవసాయం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రైతులు సాగు చేసేందుకు ఇష్టపడుతున్నారు.