Telangana Govt Jobs 2023
2,32,308.. ఇవీ తెలంగాణ కొత్త కొలువులు
మధ్యప్రదేశ్‌లో 21 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఒక్కరోజులోనే అనుకుంటే పొరపాటే… మూడేండ్ల వ్యవధిలో చేపట్టిన నియామకాల సంఖ్య అది! బీజేపీ సర్కారు నిర్వాకమిది!! కాంగ్రెస్‌పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్, కర్ణాటక రాష్ర్టాల్లోనూ నిరుద్యోగం తాండవిస్తున్నది.
ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు మొక్కవోని దీక్ష, కార్యదక్షత, విజనరీతో తెలంగాణ అన్నింటా అగ్రగామిగా అవతరించింది. ప్రత్యేకించి.. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్లోని లోపాలను సవరిస్తూ కొంగొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లను రూపొందించింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ఆ ఏడాదంతా ఉద్యోగ కల్పన, భవిష్యత్తు ప్రణాళిక, టీఎస్పీఎస్సీ ఏర్పాటు తదితర అంశాలపై శ్రద్ధ వహించింది. ఉద్యోగాల భర్తీతోపాటు కొత్త ఉద్యోగాల సృష్టిపై దృష్టి కేంద్రీకరించింది. ఒకవైపు ప్రైవేటు రంగంలో 17 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది.
పదేండ్లలోనే 1,60,083 ఉద్యోగాలు
‘తెలంగాణ వస్తే ఏమొస్తది’ అన్నోళ్లకు పదేండ్లలోనే సమాధానం దొరికింది. తెలంగాణ వస్తే ‘మా కొలువులు మాకే వస్తాయి’ అనేది రుజువయింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత.. తొమ్మిదిన్నరేండ్లలోనే 2,32,308 ఉద్యోగాలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. అందులో నియామక సంస్థలు 27 శాఖల్లో 2,02,735 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇప్పటివరకు 1,60,083 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరో 42,652 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ రాకుంటే.. అవి కూడా ఇప్పటికే పూర్తయిపోయేవి! అయితే.. ప్రతిపక్షాలు మాత్రం నిజాన్ని సమాధి చేసి అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీనే జరగలేదని పచ్చి అబద్ధాలు ఆడేస్తున్నాయి. ప్రత్యేకించి.. ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీజేపీ నానా యాగీ చేస్తున్నాయి. అయితే, ఆ పార్టీలు స్వార్థ రాజకీయమనే రొంపిలోంచి బయటికి వస్తే అసలు విషయం అర్థమవుతుంది. దేశంలో అతితక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం తెలంగాణ. గత పదేండ్ల సగటును పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలు తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు.
కాంగ్రెస్ పాలనలో ఏడాదికి 1008 ఉద్యోగాలే..
2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. ఆ కాలంలో భర్తీ చేసిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 24,086. ఇందులో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడం.. ఉద్యోగాల భర్తీ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చివరి రెండేండ్లలో భర్తీ చేసినవే సుమారు 10 వేలు. ఇక.. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో తెలంగాణ పది జిల్లాల వాటా 42 శాతం. ఆ లెక్కన పదేండ్లలో మనకు దక్కిన ఉద్యోగాలు 10,080. అంటే.. కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఏడాదికి 1,008 మాత్రమే.
సీఆర్ సారథ్యంలో ఏడాదికి 16,008 ఉద్యోగాలు..
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. అన్నట్టుగానే శరవేగంగా భర్తీ ప్రక్రియను చేపట్టారు. పదేండ్లలో 27 ప్రభుత్వ శాఖల్లో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశారు. గత కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 1,35,997 ఎక్కువ. కాంగ్రెస్ ఏడాదికి 1,008 ఉద్యోగాలు భర్తీ చేస్తే.. బీఆర్ఎస్ పాలనా కాలంలో ఏడాదికి 16,008 ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇది.. దేశంలో హయ్యస్ట్ రికార్డు.
కాంగ్రెస్‌తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ…
తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేసిన ఉద్యోగాలు 24,086 మాత్రమే. అందులో తెలంగాణ 10 జిల్లాల వాటా 42 శాతం అనుకుంటే.. మనకు దక్కినవి కేవలం 10,080 ఉద్యోగాలే. అదే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. అంటే 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య అక్షరాలా 1,60,083. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 16 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఒక్క టీఎస్పీఎస్సీతో పోల్చినా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భర్తీ చేసిన మొత్తం ఉద్యోగాలు తక్కువే. పదేండ్లలో కాంగ్రెస్ 24,086 ఉద్యోగాలను భర్తీ చేస్తే టీఎస్పీఎస్సీ మాత్రమే 35,250 ఉద్యోగాలు భర్తీ చేసింది. మరో 18,765 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏడాదికి సగటున 1,008 ఉద్యోగాలు భర్తీ చేస్తే.. బీఆర్ఎస్ పాలనలో 2014 తర్వాత ఏడాదికి సగటున 16,008 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఏ లెక్కన తీసుకున్నా బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిస్తే కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు దరిదాపులో కూడా ఉండవు. కానీ కండ్లు లేని కాంగ్రెస్ కబోదులు మాత్రం నోట్లో నరం లేని నాలుకతో పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.