TS Gurukulam Jobs
9000లకు పైగా గురుకుల ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియర్.. డిసెంబర్ 28, 29 తేదీల్లో..
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . దాదాపు 9వేల ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన.. టీఆర్‌ఈఐఆర్‌బీ మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలుకూ ప్రశ్నాపత్రాల ‘కీ’ లను సైతం విడుదల చేసింది.
త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు..
అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు. గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా… ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలున్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది.
డిసెంబర్ 28, 29 తేదీల్లో..
వీరికి ధ్రువపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలనాధికారులకు డిసెంబర్ 28, 29 తేదీల్లో ఎల్బీనగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. రెండ్రోజలు శిక్షణలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, ఒకట్రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్డు పరిధిలో ఉండగా… వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి… ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.