TS RYTHU BANDHU 2024
రైతుబంధు సర్వే ఎన్నడో?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బడా రైతులకు, సాగులో లేని వ్యవసాయ భూములకు, గ్రానైట్ క్వారీల యజమానులకు చెక్‌పెడుతూ… తీసుకున్న ఆ నిర్ణయం పట్ల రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆ సర్వేపై విధివిధానాలు విడుదల చేయలేదు.
ఇంకా విడుదల కాని విధివిధానాలు
సీఎం సర్వే ప్రకటనతో బడా యజమానుల్లో గుబులు
జిల్లాలో నాలుగు ఎకరాల రైతులకే అందిన సాయం
ఎదురుచూస్తున్న మిగతా రైతులు
‘రైతుబంధుపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఐదెకరాల వరకు ఉన్న 62 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. భవి ష్యత్‌లో రైతు భరోసాపై హామీ ఇస్తు న్నాం. గత ప్రభుత్వంలో చెట్లు.. పుట్టలు, రాళ్లు, రప్పలు, లే-అవుట్ ఉన్న బంగ్లాలకు, నేషనల్ హేవే రహదారులకు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు రైతుబంధు ఇచ్చారు. వాటన్నిం టికి ఫుల్స్టాప్ పెడతాం. రాబోయే కాలంలో రైతుబంధుపై సర్వే జరిపి.. స్ర్కూట్నీ చేసి ఇలాంటి వాటన్నిటినీ తొలగిస్తాం. కొత్తగా పట్టాలు పొందిన వారు, రైతుబంధు రాని రైతులు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అర్హులైన రైతులను గుర్తించి రైతు భరోసాను వర్తింప చేస్తాం’
– ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బడా రైతులకు, సాగులో లేని వ్యవసాయ భూములకు, గ్రానైట్ క్వారీల యజమానులకు చెక్‌పెడుతూ… తీసుకున్న ఆ నిర్ణయం పట్ల రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆ సర్వేపై విధివిధానాలు విడుదల చేయలేదు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సర్వే జరిపి అమలు చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 26 వరకు 1,80,298 మంది రైతులకు రూ.141.16 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 34,387 మంది రైతులకు రూ.91.90 కోట్లు పడాల్సి ఉంది. జిల్లాలోని మండలాల్లో నాలుగు ఎకరాల వరకే రైతుబంధు నిధులు పడ్డాయి.
రైతుబంధు ఇలా…
2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడతలుగా రైతుబంధు నిధులను విడుదల చేస్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతో రైతుబంధు నిధుల కోసం ప్రభుత్వం పాట్లు పడుతోంది. దీంతో దశల వారీగా రైతుబంధు నిధులను విడుదల చేస్తోంది. ఐదెకరాల వరకు రైతుబంధు నిధులు విడుదల చేస్తామని చెబుతున్నప్పటికి మహబూబాబాద్ జిల్లాలో మాత్రం నాలుగు ఎకరాల వరకే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో రైతుబంధు పథకానికి 2,14,685 మంది రైతులు అర్హులుగా తేల్చారు. వీరికి గాను రూ.233.07 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఈ నెల 26 వరకు 1,80,298 మంది రైతులకు రూ.141.16 కోట్లు జమ చేశారు. ఇంకా 34,387 మంది రైతులకు రూ.91.90 కోట్లు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే మొత్తం 2,14,685 మంది రైతులకు గాను 1,94,675 మంది రైతులకు రూ.170.84 కోట్ల నిధులకు సంబంధించిన వివరాలను సబ్ట్రెజరరీకి జిల్లా వ్యవసాయాధికారులు పంపించారు.
సాయం అందుకోని రైతులు
జిల్లాలో 17 మంది రైతులు మాత్రం వివిధ కారణాలతో ఈ సీజన్లో రైతు బంధు పెట్టుబడి సాయం తీసుకోలేదు. గార్ల మండలంలో ఒకరు, కేసముద్రంలో ఇద్దరు, మహబూబాబాద్‌లో ఒకరు, దంతాలపల్లిలో ఇద్దరు, కురవిలో తొమ్మిది మంది, మరిపెడలో ఇద్దరు బడా రైతులు రైతుబంధు పెట్టుబడి సాయం తీసుకోలేదని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే పథకం ప్రారంభంలో మాత్రం రైతుబంధు తీసుకోవద్దని, ఆ నిధులను ప్రభుత్వానికి వాపసు ఇచ్చేయాలని గత ప్రభుత్వం కోరడం జరిగింది. కొంత మంది ప్రజాప్రతినిధులు, బడా నాయకులు ఓసారి రైతుబంధు చెక్కులను తీసుకుని ప్రభుత్వానికి వాపసు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత నుంచి మళ్లీ రైతుబంధు తీసుకోవడం గమనార్హం.
బడా రైతుల్లో గుబులు
రైతుబంధు పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి సర్వే చేయిస్తానని ప్రకటించారు. అయితే సర్వే చేయడానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. దాంతో ప్రభుత్వం ఇంకా ఈ పథకంపై విధివిధానాలు ప్రకటించలేదు. ఎన్నికలు అయిపోయాక విధివిధానాలు ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు. ఆ తర్వాత రైతుబంధుపై పూర్తిస్థాయి సర్వే జరుగనుంది. ఇదిలా ఉండగా ఐదు ఎకరాల వరకు ఇస్తారా…? పదెకరాల వరకు ఇస్తారా..? అనేది ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. సర్వే జరగాలంటే ఒక వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖలు జాయింట్ సర్వే చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కాగా, జిల్లాలోని అనేక గ్రామాల్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు, కంకర క్వారీలు, ప్లాట్ల వెంచర్లు, సాగులో లేని భూములకు భారీగా రైతుబంధు నిధులు వస్తున్నాయి. అలాంటి వాటిని అరికట్టడంలో గత ప్రభుత్వం విఫలమైంది. సీఎం సర్వే చేస్తే ఈ బడా బాబుల బాగోతం బయట పడనుంది. దీంతో బడా బాబుల గుండెల్లో సర్వే గుబులు నెలకొంది. ఏదేమైనా ఇంకా రైతుబంధు అందని రైతులు మాత్రం ఎదురుచూస్తున్నారు.
ఇంకా విధి విధానాలు రాలేదు : అభిమన్యు, జిల్లా వ్యవసాయాధికారి
రైతుబంధు పథకంపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుని సర్వే చేయిస్తామని ప్రకటించారు. అయితే సర్వే చేయడానికి ఎలాంటి విధివిధానాలు అందలేదు. అవి అందితేనే సర్వేపై పూర్తి వివరాలు తెలుస్తాయి.