సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుంది రైతు బంధు పథకం. కొత్తగూడ మండలం చెరువు ముందు తండాలో సుమారు 122 ఎకరాల్లో 39 మంది రైతులు, రైతుబంధు పథకం కింద లబ్ధి పొందుతున్నారు. రైతు బంధు పథకం కింద ఎనిమిది విడతలలో లబ్ది పొందిన చెరువు ముందు తండా రైతులు, ఈ తొమ్మిదో విడతలో ఓ అధికారి నిర్లక్ష్యంతో చుక్కలు చూస్తున్నామని వాపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెరువు ముందుతండాలో 39 మంది రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు వచ్చాయి. కాగా రైతు బంధు కింద పడాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరి అకౌంట్లో జమ కాకపోవడంతో ఆర్ఓఎఫ్ఆర్ డీటీడీఓ మంకిడి ఎర్రయ్యను రైతులు ప్రశ్నించారు. ఆయన మాత్రం కారణాలు కమిషనర్ ఆఫీస్‌లో తెలుసుకోవాలని అన్నారు. దీంతో రైతులు కమిషనర్ ఆఫీస్‌కు వెళ్లి తెలుసుకుంటే.. వీరి గ్రామ పంచాయతీకి చెందిన 39 మంది రైతులవి కమిషనరేట్‌కు అసలు పంపలేదని తేలింది.
దీనికి గిరిజన శాఖఆర్ఓఎఫ్ఆర్ సెక్షన్ పర్యవేక్షకులు ధనసారి లక్ష్మీప్రసాద్ కారణమని రైతులందరు ఆరోపించారు. ఈ తప్పిదమే కాకుండా ఇంకా ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయని వాపోయారు. మా గ్రామ పంచాయతీకి పక్కనే గల కొత్తపల్లి గ్రామంలో గిరిజన శాఖ ఆర్ఓఎఫ్ఆర్ సెక్షన్ పర్యవేక్షకులు ధనసారి లక్ష్మీప్రసాద్ తప్పిదంతో భద్రు అనే రైతుకు 5 ఎకరాల 5 గుంటలకుగాను రూ.27,000/- రూపాయలు రైతుబంధు కింద విడదలైనాయి. అది కూడా కొత్తపల్లికి చెందిన భద్రు పేరు మీద విడుదలయ్యి, అంకన్నగూడెంకి చెందిన కల్తీ నరేష్ పేరు మీద ఉన్న అకౌంట్లో జమయ్యాయి. ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, రైతు పేరు మూడు కూడా రైతు భద్రువే ఉన్నాయి.
కానీ అకౌంట్ నెంబర్ మాత్రం గిరిజన శాఖ ఆర్ఓఎఫ్ఆర్ సెక్షన్ పర్యవేక్షకుడు ధనసారి లక్ష్మీప్రసాద్ బావమరిది కల్తీ నరేష్‌ది ఉంది. దాంతో గత మూడు సంవత్సరాలుగా నరేష్ అకౌంట్లో జమవుతున్నాయి. దీంతో రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఈ 39 రైతులతో పాటు ఈ రైతు కూడా తిరిగి తిరిగి విసిగిపోయి బుధవారం కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. ఈ చర్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ, మాకు త్వరితగతిన రైతుబంధు డబ్బులు అకౌంట్లో వేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.