TSPSC Group-1 Exam || గ్రూప్-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ వాయిదా?
తెలంగాణలో జూన్ 11న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళ వ్యక్తం అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 503 పోస్టులతో టీఎస్పీఎస్సీ భారీ గ్రూప్-1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 16న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి మెయిన్స్ కు ఎంపికైన వారి జాబితాను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అయితే.. పేపర్ లీకైనట్లు తేలడంతో ఆ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.
పేపర్ రద్దు చేసిన సమయంలోనే జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. దీంతో అభ్యర్థులంతా మళ్లీ ప్రిపరేషన్ లో మునిగిపోయారు. ఇది ఇలా ఉంటే.. పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందన్న ప్రచారం లక్షలాది మంది నిరుద్యోగలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 36 మంది అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను మరో 2 నెలలు వాయిదా వేయాలని తమ పిటిషన్లో పేర్కొన్నారు అభ్యర్థులు. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న టెన్షన్ ఇతర అభ్యర్థుల్లో నెలకొంది.
మంగళవారం ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు కాగా.. రేపు అంటే మే 25న దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్ట్ ప్రకారం గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలు నిర్వహించడానికి ప్రతీ పరీక్షకు మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలని కోర్టును ఆశ్రయించిన నిరుద్యోగులు వాదిస్తున్నారు.
నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా గ్యాప్ ఉండాలన్న నిబంధనకు వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట వ్యతిరేకం అని చెబుతున్నారు.
ఈ అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ లో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (క్రైం) అడిషినల్ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశం తీవ్ర ఉత్కంఠగా మారింది.