Andhra PradeshBusinessEducationSocialSportsTech newsTelanganaTop News

Rythu Bandhu 2024 || Check Rythu Bandhu Status 2024

పెట్టుబడి సాయానికి ఎదురుచూపులు!

 

 

పెట్టుబడి సాయానికి ఎదురుచూపులు!

 

 

రెండెకరాల్లోపు రైతులకు అందిన నిధులు

మిగతా వారికి తప్పని తిప్పలు

అప్పులు తెచ్చి ఇప్పటికే సాగు చేసిన రైతులు

రైతులు పెట్టుబడి సాయం ఎదురు చూడక తప్పడం లేదు. ఇప్పటి వరకు రెండెకరాల్లోపు రైతుల ఖాతాల్లోనే రైతుబంధు డబ్బులు పడ్డాయి. దీంతో మిగతా రైతులు తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా అని చూస్తున్నారు.

 

ఇప్పటికే పంటలు సాగు చేయడంతో బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. రైతుబంధు డబ్బులు వస్తే చేసిన అప్పులు తీరుద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అయితే, విడతల వారీగా అందరికీ డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా అని నిత్యం ఖాతాలను చెక్‌ చేసుకుంటున్నారు.

 

 

రైతుబంధు డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు కొందరికి మాత్రమే పెట్టుబడి సాయం అందింది. ఇంకా చాలామందికి ఈ డబ్బులు రాలేదు. దీంతో వారంతా ఇప్పుడు రైతుబంధు సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు పెట్టుబడి సాయంగా అందజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు ఏడాదికి పది వేల చొప్పున పంపిణీ చేస్తోంది. యాసంగి పెట్టుబడి కింద ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అదికూడా ఇప్పటి వరకు అందరికీ అందలేదు.

 

 

 

జిల్లాలో 4,04,436 మంది రైతులకు రూ. 378.92 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే, రెండు, మూడెకరాల లోపున్న 2,54,604 మంది రైతులకు ఇప్పటి వరకు రూ. 147.33 కోట్లు జమ చేసింది. ఇంకా 1,49,832 మందికి రూ. 231.59 కోట్లు జమ చేయాల్సి ఉంది. రైతుబంధు సాయం నత్తనడకన సాగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయేమోనని రైతులు రోజూ తమ ఫోన్లలో మెసేజ్‌ చెక్‌ చేసుకుంటున్నారు. రైతు సాయం జమ కాకపోవడంతో కొంతమంది రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. త్వరగా రైతుబంధు సాయం జమ చేయాలని కోరుతున్నారు. పంట పెట్టుడి కోసం అప్పులు చేసి యాసంగి పంట సాగు చేసి రైతులు రైతు బందు సాయం కోసం నిరీక్షిస్తున్నారు.

 

 

గత వానాకాలంలో కూడా కొందరికి అందలే..

గత వానాకాలం సీజన్‌లో కూడా వేలాది మంది రైతుల వరకు రైతుబంధు డబ్బులు జమ కాలేదు. వివిధ సాంకేతిక కారణాల సాకుతో ఆ సీజన్‌ ముగిసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరైన సమాధానం రాలేదు. ప్రస్తుతం కూడా డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

 

సాగు రైతులకే రైతుబంధు వేయాలి 

నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రైతుబంధు జమ కాలేదు. రెండు, మూడెకరాల భూమి ఉండి.. వారు వ్యవసాయం చేయకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఉన్న భూమి బీడు వదిలి పెట్టారు. అలాంటి వారికి రైతు బంధు డబ్బులు జమయ్యాయి. నాలాంటి రైతులకు జమ కాలేదు. పంటలు పండించే రైతులకే రైతుబంధు వేయాలి.

 

 

సకాలంలో అందించాలి

నాకు 4.20 ఎకరాల భూమి ఉంది. యాసంగి కోసం ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రైతుబంధు డబ్బులు రాలేదు. ఎకరంలోపు వారికే సర్కార్‌ డబ్బులు జమ చేసింది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో రైతుబంధు డబ్బులు వచ్చాయి. కొత్త సర్కారు కొలువుదీరాక ఎకరంలోపు రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేసింది. రెండెకరాలపై వారికి పెట్టుబడి సాయం జమ కాలేదు. సకాలంలో రైతుబంధు జమ చేయాలి.

 

 

నాకు రైతుబంధు జమ కాలేదు

నాకు ఐదెకరాల పొలం ఉంది. యాసంగికి సంబంధించిన రైతుబంధు ఇప్పటి వరకు ఇంకా జమ కాలేదు. రెండెకరాల రైతులకు వచ్చాయి. త్వరగా పెట్టుబడి సాయం అందివ్వాలి. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతుబంధు సాయం అందించాలి.

 

 

విడతల వారీ జమవుతున్నాయి

రైతులు ఎవరూ అందోళన చెందొద్దు. విడతల వారీగా అందరికీ రైతుబంధు డబ్బులు జమవుతున్నాయి. ముందుగా ఎకరం లోపు రైతులకు, తర్వాత రెండు, మూడు ఎకరాల్లోపు ఇలా అందరికీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

 

 

 

 

 

Related Articles

Back to top button