Mahalakshmi gas connection details should be fixed by 10th of this month
ఈనెల 10లోగా మహాలక్ష్మీ గ్యాస్ కనెక్షన్ వివరాలు సరిచేయాలి
మహాలక్ష్మి పథకంలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు సరి చేయడం ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు సూచించారు.
మహాలక్ష్మి పథకంలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు సరి చేయడం ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మహాలక్ష్మి గ్యాస్ కనెక్షన్ డేటా సరిచేయడం, గృహ జ్యోతి, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో గ్యాస్ కనెక్షన్ల వివరాలను సరిచేయాలని, అధిక అప్లికేషన్లు ఉన్నచోట ఎక్కువ లాగిన్స్ తీసుకోవాలన్నారు.
ప్రతి లాగిన్ లో ప్రతిరోజు 40 నుంచి 60 దరఖాస్తులు సరి చేయాలని సూచించారు. డేటా సరి చేయడం మరింత వేగవంతం చేయాలని, ఎంపీడీవోలు క్షేత్ర పరిధిలో తనిఖీ చేయాలన్నారు. గృహ జ్యోతి పథకం కోసం ప్రజా పాలన కార్యక్రమంలో అందజేసిన సమాచార ధృవీకరణ కార్యక్రమం విద్యుత్ శాఖ సిబ్బంది ద్వారా జరుగుతున్నదన్నారు. సంబంధిత సిబ్బంది వచ్చినప్పుడు దరఖాస్తు దారులు ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, విద్యుత్ బిల్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అర్హులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో తాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, ఏవేని పైప్ లైన్ లీకేజీలు, వాటర్ ట్యాంకుల మరమ్మత్తులు తదితరాలను గుర్తించి వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరి భాగస్వామ్యంతో పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాల్లో నెలకొన్న ఆయా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీపీఓ సురేష్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్ పీఓలు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.