TREIRB Answer Key 2023
తెలంగాణ గురుకుల ఉద్యోగాల ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
TREIRB TGT PGT Answer Key 2023 : తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. ఈ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి CBRT విధానంలో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదల కానున్నాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు మొత్తం 19 పనిదినాల్లో జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడుషిప్టుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామకబోర్డు (TREIRB) నిర్వహించింది.
TREIRB నిర్వహించిన ఈ పరీక్షలకు సగటున 75.68 శాతం మంది హాజరైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షల మాస్టర్ ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ ని TREIRB వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సమాధానాలు చెక్ చేసుకోవాలని.. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలుంటే గడువు తేదీలోగా తెలపాలని సూచించారు. అభ్యంతరాలు లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే తెలపాలని, ఈ-మెయిల్, వ్యక్తిగత, రాతపూర్వక అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
చివరి మూడు రోజుల కీ ఈరోజు విడుదల
TREIRB ఆగస్టు 3 నుంచి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాలు వెబ్సైట్లోని వ్యక్తిగత లాగిన్లో బుధవారం(ఆగస్టు 23) పొందుపరిచింది. ఈ ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఆగస్టు 25వ తేదీ సాయంత్రంలోగా తెలపాల్సి ఉంటుంది. 21, 22, 23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ గురువారం మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తాయని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షల ప్రాథమిక కీపై 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఈ నెల 1న జరిగిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పరీక్షలపై న్యాయవివాదం నెలకొంది. ఇది పరిష్కారమైన తరువాత వాటి ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాల్ని బోర్డు పొందుపరచనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://treirb.telangana.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.