Anganwadi Jobs 2024 || Anganwadi Vacancy 2024 Apply Online Check Notification
అంగన్‌వాడీల్లో 11,000 ఉద్యోగాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల..?
తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
Anganwadi Teacher Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో 11 వేల అంగన్‌వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అలాగే.. 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే (నర్సరీ) స్కూళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. తాజాగా మంత్రి సీతక్క తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను మీడియాకు వివరించారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు.
అంగన్‌వాడీల్లో 11 వేల ఖాళీలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు రూ. లక్ష చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. 15 వేలల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీని కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని.. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామన్నారు. తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరేందుకు ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం.. ఇప్పటికే పనిచేస్తున్నవారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
నూతన మార్గదర్శకాల ప్రకారం చూస్తే..
తాజా నిబంధనల ప్రకారం.. టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యేవారు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతై ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఏర్పడిన ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.
అలాగే.. సూపర్‌వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పోస్టులు పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. ఇందుకు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే.. ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో.. టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది. త్వరలో విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాలపై అధికారికంగా స్పష్టత రానుంది. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Telangana Anganwadi Teacher Recruitment Anganwadi Vacancy 2024