Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Merger of Anganwadis in primary schools?

ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీల విలీనం?

 

 

కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనం కోసం విస్తృతస్థాయి కసరత్తు జరుగుతోంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి

ఉమ్మడి జిల్లాలో 342 కేంద్రాల గుర్తింపు

నేటి నుంచి ఎన్‌సీఈఆర్‌టీ బృందం పర్యటన

వసతులు, ఇతర అంశాలపై పరిశీలన

 

కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనం కోసం విస్తృతస్థాయి కసరత్తు జరుగుతోంది. ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలున్న వాటిని ముందుగా గుర్తించి విలీనం చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సమీపంలోని కేంద్రాలను కూడా విలీనం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

 

 

ఉమ్మడి విశాఖ జిల్లాలో 342 చోట్ల ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగా వీటన్నింటినీ విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది ముగిసిన తరువాత దగ్గరగా ఉన్న వాటిని విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. నూతన విద్యావిధానంలో భాగంగా రెండేళ్ల క్రితమే ఉన్నత పాఠశాలకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేశారు. దీంతో ఆయా ఉన్నత పాఠశాలల్లో మూడు నుంచి పది వరకు తరగతుల బోధన జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రేషనలైజేషన్‌ చేసి ప్రాఽథమిక పాఠశాలల్లో మిగులు టీచర్లను ఉన్నత పాఠశాలకు పంపారు. ప్రస్తుతం మూడు నుంచి ఐదు తరగతులకు సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో మూడు నుంచి ఐదు తరగతుల విలీనం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. ఈ విలీనంపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి.

 

 

 

పునాది పాఠశాలలుగా మార్పు

ఇదిలావుండగా రానున్న విద్యా సంవత్సరం నుంచి ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేయనున్నారు. వీటిని పునాది పాఠశాలలు (ఫౌండేషన్‌ స్కూళ్లు) అని పిలుస్తారు. మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు మధ్య ఉండే బాల బాలికలు ఈ పాఠశాలల్లో చదువుతారు. ప్రీకేజీ నుంచి రెండో తరగతి వరకు విద్యార్థులకు అందించే బోధనను పూర్వ ప్రాథమిక విద్యగా వ్యవహరిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల విలీనం నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో వసతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరుతోంది. ఈ మేరకు నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ స్టేజ్‌ 1లో భాగంగా పునాది స్కూళ్లు ప్రారంభించే క్రమంలో ఎంపికచేసిన పాఠశాలలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) బృందం పరిశీలించనుంది. ఈ బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. సోమవారం నుంచి విశాఖ జిల్లాలోని పది మండలాల్లో ఒక్కో పూర్వ ప్రాఽథమిక పాఠశాలను సందర్శించనుంది. ఆయా పాఠశాలల్లో వసతులు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను బృంద సభ్యులు తనిఖీ చేయనున్నారు.

 

 

 

Related Articles

Back to top button