Education

కనీస విద్యా ప్రమాణాలు పాటించని కళాశాలలకు నోటీసులు..! || దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో NCTE ఆదేశాలు జారీ..?

విద్యాబోధనలో కనీస ప్రమాణాలు కూడా పాటించని బీఈడీ కాలేజీలను మూసివేయించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) భావిస్తోంది. నిర్ణీత నిబంధనల మేరకు భవనాలు, బోధనా సిబ్బంది సహాఇతర కనీస ఏర్పాట్లు కూడా లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన వేలాది కాలేజీలకు ఇక మంగళం పాడనుంది. కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన ఈ కాలేజీల కారణంగా ఏటా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో టీచర్‌ అభ్యర్థులు బయటకు వస్తున్నారు. వీరిలో కనీస ప్రమాణాలు కూడా ఉండడంలేదని ఇటీవల ఎన్‌సీటీఈ నిర్వహించిన తనిఖీల్లో తేటతెల్లమైంది. బోధన చేయలేని ఇలాంటి టీచర్ల కారణంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. సరైన ప్రమాణాలు లేకుండా కొనసాగుతున్న బీఈడీ కాలేజీలను మూసివేయించేందుకు ఎన్‌సీటీఈ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి కాలేజీలను ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు గుర్తించాలని ఎన్‌సీటీఈ సభ్య కార్యదర్శి సంజయ్‌ అవస్థి అన్ని రాష్ట్రాలు, ప్రాంతీయ మండళ్లకు నోటీసులు జారీచేశారు. అలాగే, ఎన్‌సీటీఈ సదరన్‌ రీజనల్‌ కమిటీ రీజనల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ శర్మ రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌కు కూడా లేఖ ద్వారా తెలిపారు.

19వేల కాలేజీల పనితీరు పరిశీలన కాగా, దేశవ్యాప్తంగా 19వేల బీఈడీ కాలేజీల్లోని ప్రమాణాలు, ఇతర పరిస్థితులపై ఎన్‌సీటీఈ ఇటీవల జరిపిన పరిశీలనలో నివ్వెరపోయే అంశాలు వారి దృష్టికి వచ్చాయి. అవి..
– బీఈడీ డిగ్రీ అనేది టీచర్‌గా కాకుండా పెళ్లి కోసమో, స్టేటస్‌ కోసమో.. కేవలం సర్టిఫికెట్‌ కోసమో ఈ కాలేజీల్లో పలువురు చేరుతున్నట్లు గుర్తించింది.
– వాస్తవానికి జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1 : 27గా నిర్దేశించారు. ఈ లెక్కన దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 26 కోట్లుగా ఉంది. విద్యార్థి నిష్పత్తి ప్రకారం 90 లక్షల మంది టీచర్లుండాలి. ప్రస్తుతం స్కూళ్లలో ఉన్న టీచర్ల సంఖ్య పోను అవసరమైన మిగతా టీచర్ల సంఖ్య కేవలం 3 లక్షలు మాత్రమే. కానీ, ఏటా 19 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 10వేలకు పైగా కాలేజీలను మూసేసినా ఇంకా మూడు రెట్లు ఎక్కువగా ఏటా టీచర్‌ అభ్యర్థులు బయటకు రానున్నారు.

అన్ని బీఈడీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ ఇదిలా ఉంటే.. కాలేజీల్లో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటుండడంతో ఎన్‌సీటీఈ అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని విద్యార్థులకే కాక బోధనా సిబ్బందికీ తప్పనిసరి చేసింది. అలాగే, కాలేజీకి సంబంధించిన అన్ని వివరాలను వెబ్‌సైట్లో ప్రదర్శించాలని.. అధికారులు వాటిని వారం వారం పరిశీలిస్తారని.. ప్రమాణాలు లేని కాలేజీలు, నిబంధనలు పాటించని వాటి గుర్తింపును వెంటనే రద్దుచేయనున్నట్లు హెచ్చరించింది.రాష్ట్రంలో కనీస ప్రమాణాలు కరువు ఇక రాష్ట్రంలోని మొత్తం 431 బీఈడీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలు నామమాత్రంగా ఉన్నాయి. వీటిల్లో కనీస సదుపాయాలూ కల్పించడంలేదు. కొన్నయితే సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ కేవలం కాగితాల్లోనే మాయచేస్తున్నాయి. ఒకే భవనంలో వేర్వేరు పేర్లతో కాలేజీలు నడిపిస్తున్న యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కన్వీనర్‌ కోటా కింద భర్తీ అయ్యే సీట్ల సంఖ్య అరకొరగా ఉన్నా ఆ తరువాత స్పాట్‌ అడ్మిషన్ల కింద ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్థులను రప్పిస్తూ బీఈడీ కోర్సును ఒక దందాగా మార్చేశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button