Andhra PradeshEducationTelanganaTop NewsUncategorized

తెలంగాణ ఆర్టీసీ తాజా పూర్తి సమగ్ర సమాచారం || TSRTC recruitment updates 2019

 

 

రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతున్నది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బస్సులు నిరాటంకంగా నడుస్తున్నాయి. దాదాపు 55% ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో క్రమంగా సాధారణ స్థితి ఏర్పడుతున్నది. పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం బస్సులు తిప్పడానికి చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం అవసరమైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు గౌరవ వేతనం ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలని శనివారం నిర్ణయించడంతో ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆదివారం 55% ఆర్టీసీ బస్సులతోపాటు, ఆరువేల ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

పక్కాగా ప్రత్యామ్నాయం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నిరాటంకంగా బస్సులు నడిచాయి. ఆర్టీసీ సొంత సర్వీసులను నడిపించడానికి అనుభవం ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, టైర్ మెకానిక్‌లను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవడానికి ఆదివారం నోటిఫికేషన్ జారీచేశారు. పలుచోట్ల డ్రైవర్లు, కండక్టర్లకు పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్లకు ఫిట్‌నెస్ టెస్ట్‌లు చేశారు. నియామకాలు కూడా వేగంగా పూర్తిచేయడానికి అన్నిరకాలుగా కసరత్తుచేస్తున్నారు. కండక్టర్ పోస్టులకు మహిళలు అత్యధికంగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. రద్దీని బట్టి ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతూ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆదివారం వరంగల్ రీజియన్‌లో 625 బస్సులు తిరిగినట్లు రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. తొమ్మిది డిపోల పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. ప్రజలకు ఇక్కట్లు రాకుండా బస్సులను అందుబాటులో ఉంచామని, రీజియన్‌లో పరిస్థితి క్రమంగా మామూలు పరిస్థితికి చేరుకుంటున్నదని చెప్పారు. కరీంనగర్‌లో 84.63% బస్సులు రోడ్లపై తిరిగాయి. మొత్తం 567 బస్సులతోపాటు 31 కాంట్రాక్టు క్యారియర్ బస్సులను కూడా నడిపించారు. 180 వరకు మ్యాక్సీ క్యాబ్‌లు నడిచాయి.

జనగామ డిపో పరిధిలో

ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సులు, ప్రైవేట్ స్కూలు బస్సులతో కలిపి మొత్తం 97 బస్సులను నడిపించినట్లు డిపో మేనేజర్ భూక్య ధరంసింగ్ తెలిపారు. జనగామ జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అశోక్ నేతృత్వంలో బస్సులను తనిఖీచేసి కండక్టర్లకు సూచనలిస్తూ.. రవాణా వ్యవస్థ సవ్యంగా కొనసాగేందుకు చర్యలు తీసుకొన్నారు. మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ అంచనా మేరకు 94 బస్సులు వివిధ రూట్లలో రాకపోకలు సాగించాయి. వనపర్తి డిపో పరిధిలో గ్రామీణప్రాంతాలకు బస్ సర్వీసులను పునరుద్ధరించారు. కలెక్టర్ ఆదేశాలమేరకు రెవెన్యూ సిబ్బంది సహకారంతో 98 బస్సులను నడిపించారు. వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల పరిధిలో ప్రగతి చక్రం ఆగకుండా పరుగులు పెట్టింది. ఈ మూడు డిపోల నుంచి మొత్తం 174 బస్సులు నడిచాయి. సంగారెడ్డి జిల్లాలో సమ్మె ప్రభావం కనిపించలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో 450 బస్సులను నడిపించారు. ఇందులో 300 వరకు ఆర్టీసీ సొంత బస్సులే. మంచిర్యాల డిపో పరిధిలో 38 ఆర్టీసీ బస్సులతోపాటు మొత్తం 106 బస్సులు, 60 క్యాబ్‌లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఆర్టీవో అధికారులు ప్రైవేట్ వాహనాలను తనిఖీచేసి, టోకెన్లు ఇచ్చిన తర్వాతే నిర్దేశిత రూట్లలో అనుమతిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో

మొత్తం 292 బస్సులద్వారా సుమారు 60వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ, సూర్యాపేట డిపోల పరిధిలో మొత్తం 176 బస్సులతోపాటు 42 స్కూలు బస్సులను నడిపించారు. యాదగిరిగుట్ట డిపోలో మొత్తం 60మంది డ్రైవర్లు, 60మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. గుట్టలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతో మొత్తం అరవై ఆర్టీసీ, అద్దె బస్సులతోపాటు ఇతరవాహనాలు 84 నడిపించారు. ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి భౌతికదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఖమ్మం తరలించారు. కాగా హైదరాబాద్ మెహిదీపట్నం పరిధిలోని కార్వాన్‌కు చెందిన సురేందర్‌గౌడ్ అనే ఆర్టీసీ కండక్టర్ అప్పుల బాధతో ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేందర్‌గౌడ్ రాణీగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button