Tech news

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్ లో || “జనత జనార్ధన్” యాప్ ను రూపొందించిన రాష్ట్రప్రభుత్వం

అరచేతిలో ప్రభుత్వ సేవలు, సమాచారం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది.. ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా.. సరిగ్గా అలాంటి ప్రయోగమే చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా సమస్త ప్రభుత్వ సేవలు, అందుబాటులోకి తెచ్చేందుకు, వారి అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తోంది.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో తయారుచేసి.. ప్రజలకు అందుబాటులోకి తేబోతున్న ఈ మొబైల్‌ యాప్‌ పేరు ఏమిటో తెలుసా.. జనతా జనార్దన్‌.. ప్రజలే ప్రభువులుగా భావించి, వారికి సేవలందించేందుకు ఉద్దేశించిన యాప్‌ కాబట్టి.. ఈ పేరు ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగంతో పాటు సమస్త తెలంగాణ ప్రజలకు జనతా జనార్దన్‌ ఉపయుక్తం కానుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రస్తుతమున్న వివిధ వెబ్‌సైట్లు, పోర్టళ్లతో అనుసంధానం కానుంది. కేంద్రం ఆమోదిస్తే కేంద్ర వెబ్‌సైట్లకు సైతం అనుసంధానం చేయాలని భావిస్తోంది.

వివిధ పోర్టళ్లకు అనుసంధానం
జనతా జనార్దన్‌ యాప్‌ రూపకల్పనపై కార్యదర్శులకు సీఎస్‌ జోషి ప్రాథమిక సమాచారమిచ్చారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తుది ప్రతిపాదనలను త్వరలోనే ఖరారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారు. ఆయన అనుమతి తర్వాత దీనిని విడుదల చేయనున్నారు. తర్వాత వివిధ పోర్టళ్లకు దీనిని అనుసంధానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ యాప్‌ వివరాలను వెల్లడించి, భారత ప్రభుత్వ వెబ్‌సైట్లకు కూడా అనుసంధానం చేయడానికి అనుమతి కోరతారు. కేంద్రం అనుమతి లభిస్తే వారి సమాచారం కూడా పొందవచ్చు. తద్వారా రాష్ట్రానికి సంబంధించిన సమాచారం కేంద్రానికి అందుబాటులో ఉండటమే కాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలు తెలంగాణ పౌరులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయనున్నారు.

ఉపయోగం
* అన్ని రకాల సమాచారాన్ని(డేటా బేస్‌) ఇందులో పొందుపరుస్తారు. ఒక వ్యక్తి, అతని కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను అందులో పొందుపరిచే వెసులుబాటు కల్పిస్తుంది.
* ఇందులో ప్రతి వ్యక్తికీ ఒక యునిక్‌ ఐడెంటిటీ కోడ్‌ను ఇచ్చి యాప్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. తన వివరాలను తానే అందులో పొందుపరచవచ్చు. ఒకరి వివరాలు మరొకరు చూడకుండా రక్షణ కల్పించనున్నారు.
* ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగులకు, అధికారులు ఈ యాప్‌లో భాగస్వాములుగా ఉంటారు.
* దీన్ని పూర్తిగా తెలంగాణ పౌరులే పొందేలా ప్రోగ్రామింగ్‌ చేయనున్నారు.
* భూ రికార్డులు, జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇలా ప్రభుత్వం నుంచి పౌరులు ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు.
* దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమాచారం, జీవోలు పొందవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button