Andhra PradeshEducationTop News

Government of Andhra Pradesh latest update education news 2019-20 || AP Government education information

 

Government of Andhra Pradesh latest update education news 2019-20 || AP Government education information

 

 

విద్యా వ్యవస్థని గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి సంస్కరణలు ప్రారంభించి చదివే ప్రతి కోర్సు విద్యార్థికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏయూ వ్యవస్థాపక వీసీ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం మాట్లాడుతూ చదువుల దేవాలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొదటి యూనివర్సిటీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఏయూ గర్వకారణం. విశిష్ట మేధావుల్ని అందించిన ఈ మహోన్నత విశ్వవిద్యాలయం దేశంలో 14వ స్థానంలో ఉండటం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది. వర్సిటీకి కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం కరువైందన్న విషయం గుర్తించాం. బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని వీసీ ప్రసాదరెడ్డి చెబుతున్నారంటే ప్రభుత్వం తలదించుకునే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కితేనే ఏయూని దేశంలో మొదటి 5 విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా నిలబెట్టగలం. సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే 77 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమైపోతున్నారు.

సీఎం జగన్‌ను సన్మానిస్తున్న గ్రంథి మల్లిఖార్జునరావు, మంత్రులు సురేష్, ముత్తంశెట్టి

చదువుల దీపం వెలిగిద్దాం..

ఒక దీపం గది మొత్తం వెలుగునిచ్చినట్లుగా చదువుల దీపం కుటుంబం రూపురేఖల్ని మార్చేస్తుంది. భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి కేవలం మంచి చదువు మాత్రమే. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఆ కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్‌ లాంటి స్థానానికి చేరుకున్నప్పుడే సాధ్యం. ఇందుకు ఉదాహరణ ఐఆర్‌ఎస్‌కి ఎంపికైన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఆయన ఏడో తరగతి వరకూ తెలుగు మీడియంలో, తర్వాత ఇంగ్లీష్‌ మీడియంలో చదివారు. ఆ అడుగు వెయ్యకుంటే ఐఆర్‌ఎస్‌ సాధించలేకపోయేవారు. చదువుల పట్ల తపన ఉన్న సురేష్‌కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించాం.

పాఠశాల స్థాయి నుంచి సంస్కరణలు..

రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బాత్‌రూమ్‌లు, బ్లాక్‌బోర్డులు, మంచినీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టాం. తొలిదశలో రూ.3,600 కోట్లతో 15 వేల పాఠశాలల స్థితిగతులు మారుస్తాం. మూడుదశల్లో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్‌ మీడియంలో బోధన అమలు చేస్తాం. 2024 నాటికి మన పిల్లలంతా పదో తరగతి పరీక్షల్ని ఇంగ్లీష్‌ మీడియంలో రాస్తారు. వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయో విద్యావంతులు, పూర్వ విద్యార్థులు సలహాలు ఇవ్వాలి’’.

టెక్‌ మహీంద్ర క్యాంపస్‌కు ఆహ్వానం

ఈ కార్యక్రమానికి హాజరైన టెక్‌ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ ఏపీలో మహిళా రక్షణ బిల్లు ప్రవేశపెట్టిన సీఎంకి అభినందనలు తెలిపారు. ఏపీలో అతి పెద్ద ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్ర క్యాంపస్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ కలలు ఎలా సాకారమయ్యాయో చూసేందుకు తమ క్యాంపస్‌ని సందర్శించాలని సీఎంను గుర్నానీ ఆహ్వానించారు.

రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం..

విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు అందచేస్తే పూర్వ విద్యార్థుల సంఘం నుంచి అంతే మొత్తాన్ని సేకరించి వడ్డీతో కార్యక్రమాలు నిర్వహిస్తామని జీఎంఆర్‌ గ్రూప్స్‌ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ విద్యార్థులకు మంచి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అసోసియేషన్‌ రూ.50 కోట్లు సమీకరించిన తర్వాత తనను కలిస్తే నెల రోజుల్లో రూ.50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం అభినందనీయమని గ్రంథి మల్లిఖార్జునరావు చెప్పారు.

హాస్టల్, రీడింగ్‌ రూమ్‌కు శంకుస్థాపన

ఏయూలో 200 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించే జీఎంఆర్‌ హాస్టల్‌తో పాటు రీడింగ్‌ రూమ్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

దారిపొడవునా మహిళల నీరాజనం

సాయంత్రం 4.53 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ 5.10కి అక్కడి నుంచి బీచ్‌ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు బయలుదేరారు. మహిళల రక్షణకు చరిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో దారిపొడవునా థాంక్యూ సీఎం సార్‌ నినాదాలతో ప్రజలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నీరాజనాలు పలికారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button