Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

KCR NEWS TODAY

TELANGANA NEWS TODAY

 

 

 

 

 

అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

 

అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపిణీ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వడగళ్ల వానతో పంట నష్టం సంభవించిన జిల్లాల్లో సీఎం ఇటీవల పర్యటించి, రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి తాజాగా ఆదేశించారు. కలెక్టర్లు తమ జిల్లాల్లో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)తో సర్వే చేయించి, పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావును ఆదేశించారు. ఇక రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించిన మేరకు వెంటనే ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.

 

 

 

 

 

మరోవైపు ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయం పథకాన్ని కూడా వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని సూచించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి రూ.కోటి మంజూరు శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలు సీఎం మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయినందున.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ఈ నిధులు మంజూరు చేశారు. దేవస్థానానికి ఆదాయం లేకపోవడంతో ఆలయ అధికారులు.. ఎన్నడూ లేనివిధంగా భక్తుల నుంచి విరాళాలు కోరుతూ పోస్టర్లు, ఫ్లెక్ల్సీలు ఏర్పాటు చేయడం, దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడం తెలిసిందే. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనను సైతం కథనంలో ‘ఆంధ్రజ్యోతి‘ ప్రస్తావించింది. అయితే ఈ కథనంతో అధికారులు పోస్టర్లను తొలగించగా.. ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. తాజాగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.

 

 

 

 

పోడు భూముల పంపిణీపై త్వరలో తేదీ..

రాష్ట్రంలో పోడు భూముల పంపిణీని ప్రారంభించే తేదీని త్వరలో ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అయితే.. దీనికి అర్హులైన వారిని గుర్తించారా? పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. దీంతో 4లక్షల ఎకరాలకు సంబంధించి 1.55 లక్షల మంది అర్హులకు పాస్‌ పుస్తకాలను ముద్రించి సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు పంపిణీ చేపడతామని చెప్పారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button