Loan waiver applicable to all renewal farmers
రెన్యువల్ చేయించుకున్న రైతులందరికీ రుణమాఫీ వర్తింపు

పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని, సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు.
పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని, సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. శుక్రవారం డీసీసీబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంకు సీఈవో అబీద్ ఉర్ రెహమాన్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
గడిచిన నాలుగేళ్లుగా బ్యాంకు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఖాతాదారులు, రైతులు మరోమారు తమ పూర్తి సహకారం అందించాలన్నారు. పంట రుణాలు రెన్యువల్ చేయించుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని, అపోహలు నమ్మి రుణాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. మార్టిగేజ్ రుణాలు తీసుకున్న ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలోగా తిరిగి చెల్లించాలన్నారు.
మరికొద్ది రోజుల్లోనే మరో నాలుగు కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయనున్నామని, దీనిపై ఇప్పటికే ఆర్‌బీఐకి ప్రతిపాదనలు పంపించామన్నారు. గత ఏడాది ఆశించిన మేర లాభాలు రావడంతో ఉద్యోగులు, అధికారులకు 45 రోజుల బోనస్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాడు బ్యాంక్ టర్నోవర్ రూ.22 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.30 కోట్లకు చేరువ కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, ఉద్యోగులు, రైతులు డీసీసీబీ సేవలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్‌పీఏ రుణాలపై ప్రత్యేక దృష్టి సారించామని, సత్వరమే సదరు ఖాతాదారులు తిరిగి రుణాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పునుకొల్లు రాంబ్రహ్మం, జనరల్ మేనేజర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.