Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Looking forward to Rythubandhu…

రైతుబంధు కోసం ఎదురు చూపులు...

 

 

యాసంగి సాగు కోసం సమాయత్తమైన రైతన్నలు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నిధుల విడుదలకు అప్పటి ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఆటంకంగా మారి రైతుల ఖాతాల్లోకి డబ్బు జమకాలేదు.

 

యాసంగి సాగు కోసం సమాయత్తమైన రైతన్నలు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నిధుల విడుదలకు అప్పటి ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఆటంకంగా మారి రైతుల ఖాతాల్లోకి డబ్బు జమకాలేదు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించారు. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడంతో ఈ సీజన్‌కు గతంలో మాదిరిగానే రైతుబంధు సహాయాన్ని అందించి వచ్చే సీజన్‌ నుంచి రైతు భరోసా పథకం కింద సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రజాపాలన గ్రామ సభల్లో రైతు భరోసా దరఖాస్తులు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో త్వరలోనే యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు సహాయం అందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున అందించే ఈ సాయంతో రైతులు ఎరువులు విత్తనాలు ఖరీదు చేసుకుని సాగును ప్రారంభిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు నిధులను చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

 

 

 

 

జిల్లాలో 1,90,097 మంది రైతుల వివరాలు పరిశీలన

 

 

జిల్లాలో 2023-24 యాసంగి సీజన్‌లో 2,03,096 మంది రైతులకు 182.01 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన మండల వ్యవసాయాధికారులు 1,90,097 మంది రైతుల వివరాలను పరిశీలన పూర్తి చేశారు. 1,24,837 మంది రైతులకు 55 కోట్ల 24 లక్షల 95 వేల రూపాయలను చెల్లించేందుకు వీలుగా ట్రెజరీలకు బిల్లులను పంపించారు. ఈ నెల 25 వరకు 61,800 మంది రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయాన్ని జమ చేశారు. 13 కోట్ల 39 లక్షల 53 వేల 908 రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఎకరం లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమైనట్లుగా చెబుతున్నారు.

 

 

 

 

గత ప్రభుత్వ హయాంలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులతో ప్రారంభించి రోజుకు ఎకరం భూమిని పెంచుతూ 10 నుంచి 15 రోజుల్లోగా రైతుబంధు సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. గత యాసంగిలో 1,88,518 మంది రైతులకు 177 కోట్ల 98 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు. ఈ యాసంగిలో సుమారు 2 లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందే అవకాశాలున్నాయి. సుమారు 182 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు భావిస్తున్నారు. తొలి విడత నిధులు జమ చేసి 5 నుంచి 6 రోజులు గడిచిపోయింది. వరుసగా బ్యాంకు సెలవులు రావడం కారణంగానే నిధులు రైతుల ఖాతాల్లో జమకావడానికి ఆలస్యమైనట్లుగా తెలుస్తున్నది. వారం రోజుల్లోనే జిల్లాలోని రైతులందరికి పెట్టుబడి సహాయం అందే అవకాశం ఉంది.

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button