Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM-Kisan Samman Nidhi || pm kisan.gov.in

కొందరికే ‘ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి’

 

 

 

కొందరికే ‘ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి’

 

 

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా కొంత మంది రైతులకే ప్రయోజనం చేకూరుతున్నది. 2019 ఫిబ్రవరి నాటికి పట్టాలు కలిగి ఉన్న అర్హులైన రైతులకే పథకాన్ని వర్తింపజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత పట్టాలు పొందిన రైతులకు మాత్రం పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం లేకుండాపోతున్నది. నాలుగు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం నిబంధనల్లో మార్పు తీసుకరావడం లేదు. పట్టాలు కలిగిన తమకు కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు వేడుకుంటున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2018 యాసంగి సీజన్‌ నుంచి అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని పట్టా కలిగిన ప్రతి రైతుకు వర్తింపజేస్తున్నది. ఏడాదికి ఎకరం భూమికి 10 వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అంతే మొత్తంలో పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది.

 

 

 

ఈ పథకం ద్వారా జిల్లాలో 67,332 మంది రైతులకు ప్రతి ఏటా 40 కోట్ల 39 లక్షల 92 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో జమచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తీసుకవచ్చింది. ఈ పథకం ద్వారా పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.6వేల రూపాయలు అందజేస్తున్నది. ఈ డబ్బులను మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 13 విడతల్లో 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతుబంధు పథకం ద్వారా పట్టా కలిగిన ప్రతి ఒక్కరికి ఎంత విస్తీర్ణం ఉంటే ఆ మేరకు ఖాతాల్లో సీజన్‌ ప్రారంభానికి ముందు డబ్బులను జమచేస్తున్నారు.

 

 

 

చేర్పులు, మార్పులు కరువు..

కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా 2019 ఫిబ్రవరి వరకు పట్టా కలిగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు కానీ వారికి పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరి వ్యక్తుల పేరిట భూములు ఉంటే ఒక్కరికే వర్తింపజేస్తున్నారు. ఎవరైనా పట్టాదారుడు మరణిస్తే ఆ భూమిని విరాసత్‌ చేసుకున్న వారికి తిరిగి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. తమ అవసరాల రీత్యా లబ్ధిదారులు ఎవరికైనా భూములను విక్రయించుకుంటే ఆ భూములను కొనుగోలు చేసిన రైతులకు పథకాన్ని వర్తింపజేయడం లేదు. రాష్ట్రంలో 2015లో భూప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం 2018 నుంచి హై సెక్యూరిటీ గల పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తున్నది. 2019 ఫిబ్రవరి నాటికి చాలా మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందకుండా పోయాయి.

 

 

ధరణి పోర్టల్‌లో అప్పటికి భూముల వివరాలు అప్‌డేట్‌ కాలేదు. వివాదాస్పద భూముల పరిష్కారంలోనూ జాప్యం జరిగింది. భూముల రికార్డుల ప్రక్షాళనలో కొన్ని తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దే నాటికి ప్రభుత్వానికి రెండేళ్లు పట్టింది. ఈక్రమంలో రాష్ట్రంలో చాలా మంది రైతులకు 2019 ఫిబ్రవరి తర్వాత పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా గడిచిన యాసంగి సీజన్‌లో 1,39,482 మంది రైతులకు 133 కోట్ల 50 లక్షల 20 వేల రూపాయలు జమ చేశారు. కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా 67,332 మంది మాత్రమే నమోదై ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం చూసినా జిల్లాలో మరో 20 వేల మంది రైతులకైనా ఈ పథకం వర్తిస్తుంది. ఈ విషయమై పలుసార్లు రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా ప్రయోజనం లేకుండాపోతున్నది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పథకంలో చేర్పులు, మార్పులు చేసి అర్హులైన వారికి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని వర్తింపజేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button