Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS TET UPDATES 2022 || AP TET UPDATES 2022

TET FULL DETAILS 2022

 

 

 

 

 

ఆగస్టులో ‘టెట్‌’

 

త్వరలో షెడ్యూల్, నోటిఫికేషన్‌ జారీ.. పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు

సిలబస్‌ ఖరారు చేసిన ఎస్సీఈఆర్టీ.. టెట్‌ సర్టిఫికెట్‌కు జీవితకాల చెల్లుబాటు

డీఎస్సీలో 20% వెయిటేజీ

డీఎడ్‌ అభ్యర్థులతో పాటు గతంలో రాసినవారూ సన్నద్ధం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ టీచర్‌ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. టెట్‌ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహించాల్సినా గత సర్కారు పట్టించుకోలేదు.

అధికారంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్‌ ఎలిజిబులిటీ కమ్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టెట్‌ కమ్‌ టెర్ట్‌) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్‌ నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది.

డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ
దీర్ఘకాలంగా టెట్‌ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్‌ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

వెబ్‌సైట్‌లో ప్యాట్రన్, సిలబస్‌
టెట్‌ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్‌సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్‌ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు.

ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే..
► రెగ్యులర్‌ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1ఏలో అర్హత సాధించాలి.
► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూళ్లలో 1 – 5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1బీలో అర్హత తప్పనిసరి.
► రెగ్యులర్‌ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
► టెట్‌లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్‌ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

టెట్‌ తరువాత డీఎస్సీపై దృష్టి
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్‌ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే వెను వెంటనే కరోనా రావడంతో రెండేళ్లుగా టెట్‌ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్‌ నిర్వహించి అనంతరం టీచర్‌ పోస్టుల భర్తీపై దృష్టి సారించేందుకు సన్నద్ధమవుతోంది.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button