TSPSC | గ్రూప్-1లో 103 మార్కులు నిజం కాదు.. ఇన్‌స్టిట్యూట్‌ల మాయాజాలమా.. ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతోందా?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏఈ పేపర్ వ్యవహారంతో గ్రూప్-1 పరిస్థితి ఏంటి?

గ్రూప్-1 పేపర్ లీక్ కాలేదు.. 103 మార్కులు నిజం కాదు.. కేవలం ఇది ఇన్‌స్టిట్యూట్‌ల మాయాజాలమా? టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఎలా ధ్రువీకరించారు? ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏఈ పేపర్ వ్యవహారంతో గ్రూప్-1 పరిస్థితి ఏంటి? అని ఉద్యోగార్థుల్లో ఆందోళన నెలకొంది. లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ (ఏ1) గ్రూప్-1 పరీక్ష రాశాడని, అతడికి 103 మార్కులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ప్రిలిమ్స్‌లో వచ్చిన స్కోర్లు బయటపెట్టబోమని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కోర్టుకు కూడా టీఎస్‌పీఎస్సీ ఇదే స్పష్టం చేసింది. రేషియో ప్రకారమే చెప్తామని స్పష్టం చేసింది. అలాంటిది 103 మార్కులు వచ్చినట్లు ఎలా ధ్రువీకరించారు? మరో అనుమానం ఏంటంటే.. జంబ్లింగ్ సిస్టంలోనే ప్రశ్నలు, ఆప్షన్లు ఉంటాయి. వాటిని బట్టి స్కోర్‌ను ఎలా డిసైడ్ చేశారు? దీనికి ప్రాతిపదిక ఏంటి? అంటే.. ఇక్కడ 103 మార్కులు అనేది కూడా నిజం కాదా? నిజం కాదు అనే తెలుస్తోంది.
నిన్న ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి.. ఓఎమ్మార్ షీట్, కటాఫ్ మార్కులు, వచ్చిన మార్కులు అభ్యర్థులకు తెలుసు. వాటిని మేం బయట పెట్టబోమని ఇది వరకే చెప్పామని ఆయన స్పష్టం చేశారు. అయితే, క్వశ్చన్ పేపర్ జంబ్లింగ్ సిస్టంలోనే, ఇచ్చే ఆప్షన్లు జంబ్లింగ్ సిస్టంలోనే ఉంటాయి. అంటే.. ఒక పరీక్ష హాలులో ప్రిలిమ్స్ రాసిన ఏ ఒక్క అభ్యర్థి ప్రశ్న పత్రం కూడా ఒకేలా ఉండదు. ఆ ఆప్షన్ ఏంటి అనేది పక్కనున్న వాళ్లకు కూడా తెలియదు. అలాంటిది 103 మార్కులు వచ్చాయని బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? దాన్ని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఎలా ధ్రువీకరించారు? అన్నది తెలియాల్సి ఉంది.
ఈ ప్రశ్నలను లేవెనెత్తుతూ కొందరు అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ లీక్ కాలేదని స్పష్టం అవుతోందని చెప్తున్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కుట్ర దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులు ఉద్యోగాలు మానేసి, తల్లిదండ్రులు, పిల్లలను వదిలేసి, లీవ్‌లు పెట్టుకొని, ఊరు వదిలి ఇక్కడికి వచ్చి చదివి పరీక్ష రాశారని, కానీ, కొందరు చేసే దుష్ప్రచారం వల్ల గ్రూప్-1 పరీక్షపై అనుమానాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇందులో కచ్చితంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కుట్ర దాగి ఉందని ఉద్యోగార్థులు అభిప్రాయపడుతున్నారు.