Anganwadis 2023 live
కదం తొక్కిన అంగన్వాడీలు
సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట, విశాఖలో నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట, విజయవాడ ధర్నాచౌక్‌లో, కర్నూలులో శ్రీకృష్ణదేవరాయల కూడలి ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు చేపట్టారు. 36 గంటలపాటు కొనసాగనున్న ఈ మహా ధర్నాల్లో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పీఎఫ్, ఈఎ్‌సఐ, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వేతనాలు పెంచుతానని ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కన్నా వెయ్యి రూపాయలు అధికంగానే అంగన్వాడీలకు జీతాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ తెలంగాణ కన్నా రెండు వేల రూపాయలు తక్కువగానే ఇస్తుండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సీఎం హామీలు నీటి మీద రాతలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలను పరిష్కరించకుంటే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అధిక వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసిందని, వెంటనే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు పలు ప్రధాన డిమాండ్లపైనా ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచేశారని, పర్యవేక్షణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఐసీపీడీఎ్‌సకు నిధులు కేటాయించలేదని, ఏడాది నుంచి కేంద్రాల అద్దెలు చెల్లించేందుకు నిధులు లేవని తెలిపారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా మెనూ చార్జీలను పెంచలేదన్నారు. వైఎ్‌సఆర్ సంపూర్ణ పోషణ కింద మెనూ చార్జీలు పెంచాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలనే నినాదాలతో హోరెత్తించారు.
బెదిరింపులను లెక్కచేయక..
ప్రభుత్వం అంగన్వాడీల పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆదివారం రాత్రి నుంచే ప్రయత్నాలు మొదలెట్టింది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసు(ఎంఎ్‌సకే)లకు ఇవ్వాలని ఐసీడీఎస్ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నాకు తరలిపోతే ఎంఎ్‌సకేలే అంగన్వాడీ కేంద్రాలు తెరచి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఆహారం అందజేయాలని అధికారులు సూచించారు. ధర్నాల్లో పాల్గొనవద్దని అంగన్వాడీలపై అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయినా, బెదిరింపులను లెక్కచేయకుండా వేలసంఖ్యలో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ధర్నాల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నల్ల చీరలు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.