Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Dharani Portal Updates

ధరణిలో పక్కాగా రైతుల డాటా.. మొబైల్‌ లింక్‌తో పక్కాగా భూ లావాదేవీలు

 

 

Dharani Portal | ధరణిలో పక్కాగా రైతుల డాటా.. మొబైల్‌ లింక్‌తో పక్కాగా భూ లావాదేవీలు

 

Dharani Portal |సాగు ప్రణాళికలకు, పంట కొనుగోళ్లకు.. భూ లావాదేవీలకు, పథకాల అమలుకు.. అన్నింటికీ కేరాఫ్‌ ధరణి. ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను కేవలం రికార్డుల డిజిటలైజేషన్‌ కోసమే తేలేదు. రైతుల జీవితాల్లో అద్భుతమైన, గుణాత్మక మార్పును సాధించే లక్ష్యం కోసం తీసుకొచ్చింది.

 

 

 

Dharani Portal |  ధరణిలో పక్కాగా రైతుల డాటా.. మొబైల్‌ లింక్‌తో పక్కాగా భూ లావాదేవీలు

 

 

  • ధరణి ‘సందేశం’రైతుకు సంతోషం
  • పోర్టల్‌ను తీసేస్తే అన్నదాత ఆగమే
  • ధరణిలో ప్రస్తుతం పక్కాగా రైతుల డాటా
  • దానితోనే సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు
  • పంట కొనుగోలు, పథకాల్లోనూ సాయం
  • పౌర సరఫరాల శాఖతో ధరణి ఖాతాలు,
  • వ్యవసాయశాఖ రికార్డుల అనుసంధానం
  • ఎప్పటికప్పుడు రైతులకు చేరే సమాచారం
  • లాగిన్‌ మొదలు ప్రతి దశలో అలర్ట్‌ మెసేజ్‌లు
  • అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్‌.. అవినీతి అంతం

 

 

Dharani Portal | గతంలో ధాన్యం అమ్మితే 2-3 నెలలకు గానీ చెక్కులు వచ్చేవి కావు. ఇప్పుడు రెండు, మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బు పడుతున్నది. ధరణిని తీసేస్తే మళ్లీ చెక్కుల చిక్కులు.. బోగస్‌ లెక్కల రోజులు.అలాంటి ధరణిని కాదనుకుందామా?

గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాలు. ఇప్పుడు ప్రతి ఇంచు పట్టా భూమి సెల్‌ఫోన్‌తో అనుసంధానమై ఉన్నది. లాగిన్‌ నుంచి లావాదేవీ పూర్తయ్యే వరకు అలర్ట్‌ మెసేజ్‌లు.అలాంటి ధరణిని వద్దనుకుందామా?

గతంలో రైతు పథకాలు లేక ఎక్కడ చూసినా డెత్‌ బెల్స్‌ మోగేవి. ఇప్పుడు రైతుబంధు పడినా, రైతుబీమా అందినా సమాచారం అందుతున్నది.ఇది ధరణి తెచ్చిన ఫోన్‌ బెల్‌.అలాంటి ధరణిని వదులుకుందామా?

ధరణి పోర్టల్‌ను నిలిపేస్తే రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతాంగం ఆగమాగం అవుతుంది. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ్లిపోతాయి. ఇవి వివాదాలు, ఘర్షణలు, హత్యల వంటి తీవ్రనేరాలకు దారి తీస్తాయి. రైతుబంధు పథకమూ ఆగమైపోతుంది. సమగ్ర వివరాలు లేకుంటే రైతుబీమాకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఒప్పుకోవు. మళ్లీ ఆపద్బంధు వంటి రైతులకు అక్కరకురాని పథకాన్ని తీసుకురావాల్సి వస్తుంది.

అస్తవ్యస్త వ్యవస్థను సంస్కరిస్తూ భూ రికార్డుల డిజిటలీకరణ చేసి కేసీఆర్‌ సర్కారు ధరణిని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధానమే మారిపోయింది. కల్లాల్లో ధాన్యం ఉన్నప్పటి నుంచే ప్రక్రియ మొదలవుతున్నది. సేకరణ కేంద్రం కల్లాలవారీగా తూకం వేసే తేదీలు ఇస్తున్నది. దానికి అనుగుణంగా ఆయా రైతుల ధాన్యాన్ని తూకం వేసి రసీదు ఇస్తున్నారు. అలా రసీదు ఇచ్చిన 48 నుంచి 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పంట కొనుగోలుకు సంబంధించిన సొమ్ము జమ అవుతున్నది. ‘టింగ్‌.. టింగ్‌.. టింగ్‌’ అంటూ మెసేజ్‌ల మోత మోగుతున్నది.

నాడు

తెలంగాణ రాక ముందు రైతు పంట పండించేందుకు ఎంత తండ్లాట పడేదో.. పండించిన పంటను అమ్ముకునేందుకు అంతకు మించి తండ్లాట ఉండేది. పంటను ధాన్యం సేకరణ కేంద్రానికి తీసుకెళ్లడం, కాంటా పెట్టించడం ఒక ఎత్తయితే, కాంటా పెట్టి మిల్లుకు వెళ్లిన ధాన్యానికి సంబంధించిన డబ్బు ఖాతాల్లో జమ కావడం పెద్ద ప్రహసనం. పంట పండించిన తర్వాత రైతు ఖాతాలో డబ్బులు జమ కావాలంటే కనీసం 2-3 నెలలు పట్టేది. ఇది కూడా అంతా సవ్యంగా ఉంటేనే. ఆ చెక్కులను రైతులు బ్యాంకుల్లో వేసుకుంటే అవి ఒక్కోసారి తేదీలు, సంతకాలు సరిపోలేవి కాదు. అదో తలనొప్పి. మళ్లీ చెక్కులు మార్చుకునేవారు. ఇలా చెక్కులు మార్చుకోవడం పెద్ద తంతు.

నేడు
ధాన్యం కొనుగోళ్లలో అస్తవ్యస్త తీరును సంస్కరిస్తూ కేసీఆర్‌ సర్కారు ధరణిని తీసుకొచ్చింది. దీంతో ధాన్యం కొనుగోలు విధానమే మారిపోయింది. ధాన్యం కొన్న 48 నుంచి 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పంట కొనుగోలుకు సంబంధించిన సొమ్ము జమ అవుతున్నది. ‘టింగు.. టింగు.. టింగు’ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసింది? ఎంత సొమ్ము రైతు ఖాతాలో జమ చేసింది? అని ఆ సందేశాల్లో కనిపిస్తున్నాయి. దేశంలోనే ఇదో విప్లవాత్మకమైన మార్పు. రైతు తన జీవితకాలంలో ఇంత త్వరగా ధాన్యం కొనుగోలు డబ్బులు చేతికి అందుతాయని బహుశా కలలో కూడా ఊహించి ఉండరు. ధరణితోనే ఇది సాధ్యమైంది.

హైదరాబాద్‌,  ప్రణాళికలకు, పంట కొనుగోళ్లకు.. భూ లావాదేవీలకు, పథకాల అమలుకు.. అన్నింటికీ కేరాఫ్‌ ధరణి. ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను కేవలం రికార్డుల డిజిటలైజేషన్‌ కోసమే తేలేదు. రైతుల జీవితాల్లో అద్భుతమైన, గుణాత్మక మార్పును సాధించే లక్ష్యం కోసం తీసుకొచ్చింది. పూర్తిగా ఆన్‌లైన్‌, బయోమెట్రిక్‌ లావాదేవీల ద్వారా భూముల హక్కులకు రక్షణ ఇవ్వడమే కాదు.. వ్యవసాయ ప్రణాళికల్లో, పంట కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరిస్తూ భుక్తికీ భరోసా ఇస్తున్నది. ఏ భూమి ఎంత ఉన్నది? ఏ పంటలు వేస్తున్నారు? ఎంత మేర ఉత్పత్తులు రావొచ్చు? వాటి కొనుగోలుకు ఎలా సన్నద్ధం కావాలి? వచ్చే సీజన్‌లో ఏ పంట విస్తీర్ణం ఎంత మేర ఉండాలి? అందుకే ఏ కార్యాచరణ అమలు చేయాలి? వంటివన్నీ ధరణి డాటా ఆధారంగానే సాగుతున్నాయి. ముఖ్యంగా రైతుల మొబైల్‌ నంబర్‌ అనుసంధానంతో భూ లావాదేవీలతోపాటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల సాయం అందినప్పుడు, పంట కొనుగోళ్ల డబ్బులు పడినప్పుడు.. ‘టింగ్‌.. టింగ్‌.. టింగ్‌’ అంటూ మెసేజ్‌లు పంపుతున్నది. ఇవి కేవలం సందేశాలు కాదు.. రైతుల ముఖాలపై చిరునవ్వులు.

నాడు చెక్కు ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే
రాష్ట్రంలోని వ్యవసాయశాఖ ధరణిలోని భూముల వివరాల ఆధారంగా రైతులు పండించే పంట వివరాలను సేకరిస్తుంది. తమ వద్ద రికార్డులను భద్రపరుస్తుంది. దీనికి అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. పంట రికార్డులను గ్రామాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాలతో అనుసంధానిస్తారు. ఇలా అనుసంధానించడంతో ఏ గ్రామంలోని రైతు ఏ పంట వేశారో తెలిసిపోతుంది. పంట ఎంత వస్తుందో అంచనా ఉండటంతో పంట సేకరణ సులువు అవుతుంది. అంతే కాకుండా రైతుల పేర్లు, వారి పాస్‌బుక్‌, బ్యాంక్‌ ఖాతాలన్నీ అందుబాటులో ఉండటంతో రైతు కేవలం తూకం వేసి ఇస్తే సరిపోతుంది. నేరుగా రైతుల ఖాతాల్లో ధాన్యం సేకరణకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయి. రైతులు తాము పండించిన పంట అమ్మిన తర్వాత ఇంట్లో కూర్చుంటే మొబైల్‌ ఫోన్‌కు డబ్బులు వేసిన మెసేజ్‌లు వస్తాయి. గతంలో రైతులు పంట అమ్మిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ, పౌరసరఫరాల సంస్థ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇక చెక్కులు రావాలంటే ఆషామాషీ కాదు. ప్రతి స్థాయిలోనూ అమ్యామ్యాల వ్యవహారమే ఉండేది.

చేతిని తడిపితేనే చెక్కు చేతిలో పెట్టేవారు. నాడు అధికారుల వద్ద సమాచారం గందరగోళంగా ఉండేది. ఇది దళారులకు కూడా వరంగా మారేది. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చూపించేవాళ్లు. రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును మింగేసిన సందర్భాలు అనేకం. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌, రైస్‌మిల్లర్లు చేసే దందాలు అన్నీ ఇన్నీ కావు. రైతుల నుంచి ధాన్యం సేకరించకుండానే రికార్డుల్లో ధాన్యం కొన్నట్టు చూపించి, వాటిని మిల్లింగ్‌ చేసినట్టు రికార్డులు సృష్టించి రేషన్‌ షాపుల నుంచి బియ్యం తెచ్చి మళ్లీ ప్రభుత్వానికే అమ్మేవారు. తద్వారా కోట్ల రూపాయలు చేతులు మారేది. మామిడి తోటలో కూడా వరి పండించినట్టు చూపెట్టి ధాన్యం అమ్మినట్టు రికార్డులు సృష్టించి, ధాన్యం మిల్లింగ్‌ చేసినట్టు రికార్డులను మార్చి డబ్బులను మింగిన ఘనులు ఉండేవారు.

ఇలాంటివారిపై నిఘా పెట్టిన తెలంగాణ సర్కారు వారి ఆటకట్టించింది. ప్రస్తుత ఎమ్మెల్సీ, సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రాంరెడ్డి స్వయంగా అనేక మంది మిల్లర్లు, దళారులపై కేసులు పెట్టించి వారి నుంచి డబ్బులు, ధాన్యాన్ని రికవరీ చేశారు. లోపభూయిష్టమైన విధానాలన్నింటికీ ధరణి పరిష్కారం చూపింది. పౌరసరఫరాల సంస్థలో ‘ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌)’ ఏర్పాటు చేసి రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో కొన్నారు? కొన్న ధాన్యానికి ఎన్ని రోజుల్లో డబ్బులు చెల్లించారు? అన్నది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ధరణి లేకపోతే ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం కూడా ఉండదు. ఇవి లేకపోతే రైతన్నకు మళ్లీ కష్టాలు తప్పవు.

 

Dharani

 

 

ధరణిని ఆపేస్తే మళ్లీ ‘డెత్‌ బెల్స్‌’
ధరణి పోర్టల్‌ను నిలిపేస్తే రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతాంగం ఆగమాగం అవుతుంది. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ్లిపోతాయి. ఇవి వివాదాలు, ఘర్షణలు, హత్యలు వంటి తీవ్రనేరాలకు దారి తీస్తాయి. రైతుబంధు పథకం కూడా ఆగమైపోతుంది. అధికారికంగా, సమగ్ర వివరాలు లేకుంటే రైతుబీమాకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఒప్పుకోవు. దీంతో మళ్లీ ఆపద్బందు వంటి రైతులకు అక్కరకురాని పథకాన్ని తీసుకురావాల్సి వస్తుంది. అప్పట్లో రైతు చనిపోతే ప్రభుత్వం ఆపద్భందు పథకం కింద రూ.50 వేలు మాత్రమే ఇచ్చేది. వీటికోసం గ్రామ పంచాయతీలో డెత్‌ సర్టిఫికెట్‌తో మొదలు పెడితే.. వీఆర్వో, ఆర్‌ఐ, తాసిల్దార్‌, ఆర్డీవో వరకు, వ్యవసాయ శాఖలో ఏఈవో మొదలు జిల్లా స్థాయి అధికారి వరకు ప్రాధేయపడాల్సి వచ్చేది. నేతలమని చెప్పుకొనే మధ్య దళారులు కూడా ఉండేవారు.

‘నీకు ఉత్తిపుణ్యానికి రూ.50 వేలు వస్తున్నాయి. మరి నా కథేంది చెప్పు, నాకేం లేదా?, నాకు ఏం ఇస్తవ్‌’ వంటి మాటలు దాదాపు అన్ని స్థాయిల్లో వినిపించేవి. అడిగిన వారికి లంచాలు ఇస్తూ వెళ్తే చివరికి రూ.10 వేలో, రూ.20 వేలో మిగిలేవి. అవి కూడా నెలలపాటు ఎదురుచూడాల్సి వచ్చేది. సంవత్సరీకం తర్వాత చెక్కులు తీసుకున్న సందర్భాలెన్నో. ఇప్పుడు ఆ గోస లేదు. రైతు మరణిస్తే వారంలోపే నేరుగా ఖాతాల్లో రూ.5 లక్షలు పడుతున్నాయి. అదికాకుండా, ధరణిని నిలిపేస్తే ‘టింగ్‌..టింగ్‌’మనే ఫోన్‌ బెల్స్‌కు బదులు రైతుల ఆందోళనలు, ఆవేదన, ఆక్రందనలతో కూడిన ‘డెత్‌ బెల్స్‌’ వినిపించడం ఖాయం. మరి ధరణిని బంగాళాఖాతంలో వేయాలో, ఆ మాటలన్న ప్రతిపక్షపోళ్లను బంగాళాఖాతంలో వేయాలో ప్రజలే తేల్చాలి.

ధరణితో ‘టింగ్‌.. టింగ్‌.. టింగ్‌..’
ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత భూముల లావాదేవీలకు సంబంధించి గానీ, వ్యవసాయ ప్రణాళికలకు సంబంధించి గానీ భూ యజమాని/రైతుకు ప్రతి సందర్భంలోనూ ‘టింగ్‌.. టింగ్‌.. టింగ్‌’ అంటూ మెసేజ్‌ రూపంలో సమాచారం వెళ్తున్నది. గతంలో యజమానికి తెలియకుండానే ఒకరి పేరు మీది నుంచి మరొకరి పేరు మీదికి భూమి సులభంగా మారిపోయేది. వీఆర్వో ఒక్కడే రైతు తలరాతను ఇష్టం వచ్చినట్టు మార్చే శక్తి ఉండేది. ఇక పైస్థాయి అధికారులు ఇంకా ఎంత చేయగలరో ఆలోచించుకోవచ్చు. మన పట్టా, మన పాస్‌బుక్‌ మన దగ్గరే ఉండేది. కానీ రికార్డుల్లో తేడాలుండేవి. ఇవన్నీ లంచాలకు కక్కుర్తిపడో, పలుకుబడికి లొంగిపోవడం వల్లనో జరిగేవి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు ధరణి చెక్‌ పెట్టింది. రైతులు కడుపులో సల్ల కదలకుండా కూర్చునేంత ధీమా వచ్చింది. ధరణిలో భూ లావాదేవీలకు వీఆర్వోల అనుమతి అవసరం లేదు. ఎవరిచ్చే సర్టిఫికెట్లూ అక్కర్లేదు. పోర్టల్‌లో భూమి రికార్డులకు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేశారు. దీంతో భూ లావాదేవీలు చేయాలంటే ప్రతి దశలోనూ టింగ్‌.. టింగ్‌.. టింగ్‌ అని భూ యజమాని ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. లాగిన్‌ మొదలు రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే వరకు ఓటీపీలు, మెసేజ్‌లతో పకడ్బందీగా జరుగుతున్నది.

  • ఎవరైనా భూమిని అమ్మాలన్నా, గిఫ్ట్‌ లేదా వారసత్వం, భాగ పంపకం చేయాలన్నా ముందుగా ధరణి పోర్టల్‌లో లాగిన్‌ కావాలి.
    ఇందుకు యజమాని ఫోన్‌ నంబర్‌, దానికి వచ్చే ఓటీపీ కావాలి. లాగిన్‌ కాగానే.. వెంటనే మీరు ధరణి పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యారంటూ ‘టింగ్‌.. టింగ్‌’ అని మెసేజ్‌ వస్తుంది.
  • స్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా కచ్చితంగా యజమాని ఫోన్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
  • చలాన్‌ ఎంత చెల్లించామో సూచించే మరో మెసేజ్‌ ఫోన్‌కు వస్తుంది.
  • స్లాట్‌ బుక్‌ అయిన తర్వాత ఫలానా రోజున, ఫలానా పత్రాలతో మండల కార్యాలయానికి రావాలని మెసేజ్‌ రూపంలో సమాచారం ఇస్తుంది.
  • మండల కార్యాలయానికి వెళ్లిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అన్ని దశల్లోనూ అలర్ట్‌ మెసేజ్‌లు వస్తాయి.
  • చివరగా ఎంత విస్తీర్ణం మేర భూమి బదలాయింపు జరిగిందో వివరంగా మెసేజ్‌ వస్తుంది.
    ఇలా ప్రతి దశలోనూ పకడ్బందీగా మెసేజ్‌ల రూపంలో భూ యజమానిని అలర్ట్‌ చేస్తుంది. దీంతో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా లావాదేవీలు జరుగుతున్నాయి.
  • రైతు బంధును ప్రభుత్వం విడుదల చేయగానే నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు చేరుతున్నది. ఎంతమేర డబ్బులు వచ్చాయో బ్యాంకు నుంచి వెంటనే రైతు ఫోన్‌కు మెసేజ్‌ వెళ్తున్నది.
  • పంట కొనుగోళ్లలోనూ అంతే.. ప్రభు త్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉత్పత్తులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బు ఖాతా లో జమ కాగానే బ్యాంక్‌ నుంచి మెసేజ్‌లు వెళ్తాయి.
  • రైతుబీమా సందర్భంలోనూ క్లెయిమ్‌ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి డబ్బు కుటుంబ సభ్యుల ఖాతాలో చేరేవరకు సందేశాల ద్వారా ప్రభుత్వం సమాచారం చేరవేస్తున్నది.

గతంలో 3 నెలలైనా పైసలొచ్చేవి కావు
గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే.. రెండు, మూడు నెలలైనా పైసలిచ్చేటోళ్లు కాదు. తర్వాత డబ్బుల కోసం చెక్కులిచ్చేటోళ్లు. చెక్కులు మార్చేందుకు బ్యాంకుల చుట్టూ తిరిగేటోళ్లం. తిరిగి తిరిగి యాస్టకొచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల కష్టాలను సీఎం కేసీఆర్‌ సార్‌ గుర్తించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారంలోపే రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చేశారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌. ఆయనకు రైతులందరూ రుణపడి ఉంటారు.
– పడాల ఆంజనేయులు, రైతు, బూరెడ్డిపల్లి, జడ్చర్ల మండలం, మహబూబ్‌నగర్‌

పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయిపోయింది
మాకు రత్నాపూర్‌ కాండ్లి శివారులో నా భర్త రాజేశ్‌ పేరున 21 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయన అనారోగ్యంతో జనవరిలో కాలం చేసిండు. ఆ భూమిని నా పేరున మార్చుకునేందుకు వారం కిందట తాసిల్‌ ఆఫీసుకు పోయిన. మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకొని రమ్మని చెప్తే, పోయి చలాన్‌ కట్టిన. సోమవారం పొద్దుగాల 11 గంటలకు తాసిల్‌ ఆఫీసుకు పోయిన పది నిమిషాలల్ల పనైపోయింది. నా పేరు మీద భూమి మారినట్టు కంప్యూటర్‌ కాపీ కూడా ఇచ్చిన్రు. వారం, పది రోజుల్లో కొత్త పాస్‌బుక్కు ఇంటికే వస్తుందని చెప్పిన్రు. మీసేవల కట్టిన చలాన్‌ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు కాలె. ధరణి వల్ల తొందరగా పనైంది. సీఎం కేసీఆర్‌ సారు నా భర్త చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షల సాయం ఇచ్చిండు. నా బిడ్డలను మంచిగ సదివించుకుంట. ఇప్పుడు భూమి కూడా నా పేరు మీద మారింది. ఇంకా నాకు ఏ దిగుల్లేదు.
– ఇస్లావత్‌ లక్ష్మి, వడ్యాల్‌, లక్ష్మణచాంద మండలం, నిర్మల్‌ జిల్లా

ఇప్పుడు ధాన్యం అమ్మిన వెంటనే బ్యాంకులో పైసలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అండగా నిలిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే పైసల కోసం నెలల తరబడి వేచి చూసేటోళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇప్పటికి 100 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించా. ఎక్కడా, ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులను బ్యాంక్‌ ఖాతాల్లో వేశారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ పుణ్యమే. ధాన్యం అమ్మాలంటే ఇప్పుడు ఏ ఇబ్బందీ లేదు. దళారీల బెడద తప్పింది.
– కే శశిపాల్‌రెడ్డి, రైతు, తాండ్ర గ్రామం,కల్వకుర్తి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

రైతులకు మంచి సౌలతైంది
ఇంతకుముందు పహాణీ నకల్‌ కావాలన్నా ఆఫీసుల చుట్టూ నెలలకొద్దీ తిరగాల్సి వస్తుండే. ఎవుసం పనులు విడిచిపెట్టుకొని రావాల్సి వచ్చేది. ధరణి అందుబాటులోకి వచ్చినంక గా బాధలేవీ లేకుండా పోయినయ్‌. నాకు బజార్‌హత్నూర్‌ మండలం కొల్హారి శివారుల రెండెకరాల భూమి ఉన్నది. దానిని వేరేవాళ్లకు అమ్ముకున్నం. వాళ్లు మీసేవల దరఖాస్తు చేసుకుంటే తాసిల్‌ ఆఫీసుకు వచ్చిన. అద్దగంటల్నే భూమిని వారి పేరిట మార్చి ఇచ్చిన్రు.
– అల్లం మాధవరావు, రైతు, కౌఠ, బోథ్‌ మండలం

ఒక్క పైసా ఎక్కువ ఖర్చు కాలె
సరంపల్లి శివారులో ఉన్న ఎకరం భూమిని కొన్నా. రిజిస్ట్రేషన్‌ కోసం మీసేవలో రెండు రోజుల ముందే స్లాట్‌ బుక్‌ చేసుకున్న. సోమవారం కామారెడ్డి తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చిన. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. చలాన్‌ తప్ప అదనంగా ఒక్క పైసా ఖర్చు కాలేదు. గతంలో వీఆర్వోల చుట్టూ తిరిగి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి, ఎంతో కొంత ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకునేటోళ్లం.
– నిట్టు గంగాధర్‌రావు, సరంపల్లి, కామారెడ్డి

గతంలో రోజంతా టైం వేస్ట్‌ అయ్యేది
ఇంతకు మునుపు భూమి రిజిస్ట్రేషన్‌కు పోతే ఒక రోజు మొత్తం పట్టేది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దే పడిగాపులు కాసేటోళ్లం. రిజిస్ట్రేషన్‌ అంటేనే భయమైతుండె. ఇప్పుడంత మారిపోయింది. ముందే స్లాట్‌ బుక్‌ చేసుకుని తాసిల్దార్‌ ఆఫీసుకు వచ్చినం. కొద్దిసేపట్లనే పని అయిపోయింది. మా భూములకు ధరణితో భరోసా కలిగింది.
– పిట్ల రవి, గుండారం, నిజామాబాద్‌ జిల్లా

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button