Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rythu Bandhu

Rythu Bandhu ఈ నెల 26 నుంచి రైతు బంధు 2023

 

 

 

రైతుబంధువు కేసీఆర్‌

 

సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగం స్వరాష్ట్రంలో సంబురంగా మారడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఒకనాడు అప్పులు, మిత్తీలతో కొట్టుమిట్టాడిన రైతాంగం నేడు కేసీఆర్‌ ఇస్తున్న పెట్టుబడి సాయంతో సంతోషంగా ముందుకు ‘సాగు’తున్నది. గతంలో పంటలు వేసే ముందు రైతులు అనేక తిప్పలు పడేవారు.

 

 

  • 11వ విడుత పంపిణీకి సీఎం నిర్ణయం
  • వానాకాలం సీజన్‌కు పెట్టుబడి సాయం
  • ఈ నెల 26 నుంచి రైతు ఖాతాల్లో జమ
  • ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల మందికి లబ్ధి
  • ముఖ్యమంత్రి ప్రకటనతో రైతుల్లో హర్షాతిరేకాలు

 

సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగం స్వరాష్ట్రంలో సంబురంగా మారడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఒకనాడు అప్పులు, మిత్తీలతో కొట్టుమిట్టాడిన రైతాంగం నేడు కేసీఆర్‌ ఇస్తున్న పెట్టుబడి సాయంతో సంతోషంగా ముందుకు ‘సాగు’తున్నది. గతంలో పంటలు వేసే ముందు రైతులు అనేక తిప్పలు పడేవారు. విత్తనాలు, ఎరువులు కొనడానికి అప్పులు చేసే వారు. చివరకు పండించిన పంటను అమ్మితే అప్పులు, మిత్తీలకే సరిపోయేది. నాలుగు రూపాయలు మిగిలితే కుటుంబ పోషణకు సరిపోగా, వచ్చే పంట పెట్టుబడి పెట్టేందు కు మాత్రం చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. దీంతో దిక్కులేక రైతులు గ్రామంలో పెద్దల వద్ద మోకరిల్లాల్సి వచ్చేది. రూ.2 నుంచి రూ.4లకు వడ్డీ తీసుకుని రుణ బందీలుగా మారి సతమతమయ్యే వారు. తీరా చేసేది లేక రుణ విముక్తి కోసం ఉరి స్తంభం ఎక్కే గడ్డు పరిస్థితులు గత పాలకుల సమయంలో కోకొల్లలు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడింది. పెట్టుబడికి రందీ పడే రోజులకు కాలం చెల్లింది. రైతుబంధు పథకంతో కేసీఆర్‌ రైతాంగానికి బంధువుగా మారారు. అనేక పథకాలతో సాగును సంబురం చేశారు. తద్వారా సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దేవుడిలా మారాడు. రైతుబంధు పథకం కర్షకుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతుండడంతో రెట్టించిన ఉత్సాహంతో కర్షకులు సాగుబాట పడుతున్నారు. వానాకాలానికి సంబంధించి జూన్‌ 26 నుంచి రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఐదున్నర లక్షల మంది కర్షకులకు ప్రయోజనం చేకూరనున్నది.

Rytrhu Bandu

 

 

వానాకాలం సీజన్‌కు రూ.517 కోట్లు..
నిజామాబాద్‌ జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారితమైంది. నీటిపారుదలరంగంలో అద్భుతమైన వృద్ధి ఫలితంగా సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. 2014లో 4.4 లక్షల ఎకరాల పంటల సాగు విస్తీర్ణం ఉండగా, తొమ్మిదేండ్లలో అదనంగా 1.26 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్‌లో సాగయ్యే పంటల అంచనాల మేరకు 5.40 లక్షల ఎకరాలు పచ్చగా మా రుతున్నాయి. 2014లో వరి పంట సాగు 1.93 లక్షల ఎకరాలు కాగా, 2022 యాసంగికి 116 శాతం వృద్ధితో 4.14లక్షల ఎకరాలు సాగవడం విశేషం. 2022 యాసంగి సీజన్‌ వరకు పది విడుతల్లో నిజామాబాద్‌ జిల్లాలో 2.50 లక్షల మంది రైతులకు రైతుబంధు నగదును రూ.2,385కోట్లు జమ చేశారు. 2,60,617 మంది రైతులకు ఈ వానాకాలం సీజన్‌లో దాదాపు రూ.265 కోట్లు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 10 విడుతల్లో 2,79,352 మంది రైతులకు రూ.2,289.88 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.252.76 కోట్లు వెచ్చించేందుకు ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రైతుల సంఖ్య పరంగా కామారెడ్డి జిల్లా టాప్‌లో ఉంది. రైతుబంధు పంపిణీ లో నిజామాబాద్‌ జిల్లాలోనే అధికంగా వ్యయం అవుతుంది. ఈ సీజన్‌కు ఉభయజిల్లాల్లో 5.39లక్షల మంది రైతులకు దాదాపు రూ.517 కోట్లు ప్రభుత్వం కేటాయించనున్నది.

11వ విడుతకు ఏర్పాట్లు..
దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ సీఎం కేసీఆర్‌ యావత్‌ దేశ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగునీటి సదుపాయం వంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా రైతులోకం మురిసిపోతున్నది. ఇదే సమయంలో పక్క రాష్ర్టాల్లోని రైతన్నలంతా కేసీఆర్‌ లాంటి నాయకుడు తమకు కూడా కావాలంటూ నినదిస్తున్నారు. 2018 మే 10న మొదలైన రైతుబంధు పథకం ఇప్పుడు 11వ విడతకు చేరింది. ఈ పథకంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఐదున్నర లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందుతుండడంతో వారి రుణ గోస పూర్తిగా తీరిపోయింది. ప్రభుత్వం అందిస్తున్న సాయం సమయానికి రైతుకు చేరుతున్నది. ఏటా వానకాలం, యాసంగి వచ్చిందంటే చాలు టక్కున వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో రైతన్నలు పడిగాపులు కాసేటోళ్లు. లేదంటే వడ్డీ వ్యాపారులే రైతుల ఇళ్లకు చక్కర్లు కొట్టేవారు. వారి కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ పబ్బం గడిపే వడ్డీరాయుళ్లకు కేసీఆర్‌ పెట్టుబడి సాయంతో చెక్‌ పడింది. మరోవైపు, ఫర్టిలైజర్స్‌ యజమానులు సైతం గతంలో రైతులను నిలువునా దోచుకునే వారు. ఎక్కువ ధరలకు ఎరువులు, విత్తనాలను అప్పగించడంతో పాటు వడ్డీ పేరిట వసూలు చేసే వారు. ఇలాంటి దుస్థితి నామరూపాల్లేకుండా పోయింది.

ఈ నెల 26 నుంచి పంపిణీ..
11వ విడుత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేసిన దరిమిలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. 2022 యాసంగిలో అర్హులైన వారితో పాటు ఈ సీజన్‌ ప్రారంభం నాటికి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు మార్పిడి చేసుకున్న వారికి రైతుబంధు వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సా యాన్ని జమ చేయాలని ఆదేశాలివ్వడంతో రైతుల్లో సంబురం వ్యక్తమవుతున్నది. దిగ్విజయంగా అమలవుతున్న రైతుబంధు ద్వారా అనేక మంది కర్షకుల కష్టాలకు చెల్లుచీటి దొరుకుతున్నది. ధరణి పోర్టల్‌ సమాచారం ఆధారంగా రైతుల వివరాలను సేకరిస్తున్నారు. చిన్న కమతాల నుంచి పెద్ద కమతాల వరకు గతంలో మాదిరిగానే విడుతల వారీగా రైతుబంధు నిధులు జమ కానున్నాయి.

సమయానికి పెట్టుబడి సాయం
బాన్సువాడ టౌన్‌ : గతంలో పంట వేయడానికి అప్పుల కోసం తిరిగేటోళ్లం. సమయానికి డబ్బు అందక బంగారాన్ని తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్‌ మా కష్టాలు గుర్తించి సమయానికి పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పెట్టుబడి సమయానికి మా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సీఎం సార్‌కు ధన్యవాదాలు.

-నర్సగొండ, రైతు బాన్సువాడ.

పెట్టుబడికి రందీ లేకుండా పోయింది..
నాకు మూడు ఎకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పంట వేసే సమయానికి పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తున్నది. దీంతో నాకు రందీ లేకుండా పోయింది. ఇంతకుముందు పొలం దున్నడానికి, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడానికి తెలిసిన వారి దగ్గర వడ్డీకి తెచ్చుకొనేటోళ్లం.

-గదుమల కాశీరాం, రైతు బాన్సువాడ

సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి
ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. కానీ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకైక సీఎం కేసీఆర్‌ మాత్రమే. రైతును రాజు చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిన పథకమే ఈ రైతుబంధు. ఈ పథకం ద్వారా మా రైతులకు పంట పెట్టుబడి ఇబ్బందులు దూరమవ్వడంతో పాటు ఏ ఒక్కరిపై ఆధారపడకుండా వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నాం.

-దొన్కంటి జగన్‌, రైతు, బాన్సువాడ

సీఎం కేసీఆర్‌ సార్‌ సల్లంగుండాలె..
వ్యవసాయం చేయాలంటే భయపడి పట్టణాలకు కూలీ పనుల కోసం పరుగుల పెట్టిన రైతును వ్యవసాయానికి మించిన ఉద్యోగం లేదని సగౌరవంగా బతికేలా చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. పంట పెట్టుబడి సాయం కోసం రెండు పంటలకు విడుతల వారీగా ఎకరానికి రూ.10 వేలు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేస్తూ రైతుకు గుండె ధైర్యాన్ని నింపిన సీఎం కేసీఆర్‌ సార్‌ నిండు నూరేండ్లు సల్లగుండాలి.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button