Telangana

హరీష్ రావు ఎమ్మెల్యేగా ఆరుసార్లు || మంత్రిగా మూడుసార్లు రికార్డ్

సీఎం కేసీఆర్‌ తన కేబినెట్‌ విస్తరించడంతో మంత్రి వర్గంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు చోటు లభించింది. ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేత మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆరుగురు మంత్రుల్లో మొదటగా హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ హరీశ్‌రావుకు ఆర్థిక శాఖను కేటాయించారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు.

రెండవ సారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆదివారం జరిగిన కేబినెట్‌ విస్తరణలో హరీశ్‌రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేసుకొన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివెళ్లారు. హరీశ్‌రావును హైదరాబాద్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, గజ్వేల్‌, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు.

పదవులు ఇలా..

-టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియా శీల నాయకుడిగా పని చేస్తున్నారు.
-2004లో వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా హరీశ్‌రావు పనిచేశారు.
-2004 అక్టోబర్‌లో మొదటి సారిగా సిద్దిపేట శాసన సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.
-2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64014 ఓట్ల మెజార్టీ సాధించి తన రికార్డును తానే తిరగరాశారు.
-2010లో మరోసారి జరిగిన ఉప ఎన్నికల్లో 95858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక రికార్డు మెజార్టీతో నంబర్‌1గా నిలిచారు.
-2014 సాధారణ ఎన్నికల్లో 93328 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారు.
-తొలి తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్‌, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
-2018లో 6వ సారి సిద్దిపేట శాసన సభ స్థానం నుంచి పోటీ చేసి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.
-2019 సెప్టెంబర్‌ 8న సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్‌ హరీశ్‌రావుకు ఆర్థిక శాఖను కేటాయించారు.
-సిద్దిపేట నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి తెలంగాణలో రెండు సార్లు మొత్తం మూడు సార్లు మంత్రిగా హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు.

జిల్లాలో సంబురాలు
కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. మంత్రిగా హరీశ్‌రావు ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులు శ్రీనివాస్‌, బాల్‌రెడ్డితో పాటు కార్యకర్తలు పటాకులు కాల్చారు. రంగధాంపల్లి అమరవీరుల చౌరస్తా వద్ద జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా డైరెక్టర్‌ ముత్యాల కనకయ్య, నాయకులు ఐలయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, తిరుమల్‌రెడ్డిల ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. టీఆర్‌ఎస్‌వీ పట్టణాధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో ముస్తాబాద్‌ చౌరస్తాలో విద్యార్థులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. 23వ వార్డులో కౌన్సిలర్‌ లక్ష్మి సత్యనారాయణ, వార్డు అధ్యక్షుడు పద్మారెడ్డి, సీనియర్‌ నాయకులు బుచ్చిరెడ్డి స్వీట్లు పంచి, నైట్‌ షెల్టర్‌లో ఉన్న నిరాశ్రయులకు పండ్లను పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద సంబురాలు జరుపుకున్నారు. కౌన్సిలర్‌ సాకి బాల్‌లక్ష్మి, సిద్దిపేట జిల్లా రేషన్‌ డీలరు అసోసియేషన్‌ సభ్యులు స్వీట్లు పంచారు. అభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో సంబురాలు జరుపుకున్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ శారద, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు భిక్షపతి ఆధ్వర్యంలో స్వీట్లు పంచగా, నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button